ప్యూచర్ సిటీకి కేంద్రం నుంచి సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం (నవంబర్ 18) హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లో అర్బన్ డెవలప్ మెంట్ ప్రాంతీయ సమావేశంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. మూసీ పునరుజ్జీవం, RRR, మెట్రో రైల్ విస్తరణకు కేంద్రం అనుమతులివ్వాలని కేంద్రం మంత్రిని కోరారు.
తెలంగాణలో 30 వేల ఎకరాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఫ్యూచర్ సిటీకి కేంద్ర సహకారం కావాలని కేంద్ర మంత్రిని కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. 2047 వరకు 3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో 10 వ శాతం తెలంగాణ వాటా ఉండాలని చూస్తున్నట్లు సీఎం చెప్పారు. డిసెంబర్ 9 రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామని తెలిపారు. మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులనే నడుపుతామని.. అన్ని రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకు కేంద్రం సహకారం ఉండాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విన్నవించారు సీఎం రేవంత్.
