- ‘క్యూర్, ప్యూర్, రేర్’ పాలసీలను పక్కాగా అమలు చేయాలి
- నెలకు మూడుసార్లు ఐఏఎస్‌లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే
- ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతర నిఘా
- కార్యదర్శులు శాఖల పురోగతిపై సీఎస్‌కు నివేదిక ఇవ్వాలి
- జనవరి 31 కల్లా ఆఫీసుల్లో ‘ఈ-ఫైలింగ్’ అమలు కావాలి
- టీచింగ్ హాస్పిటల్స్‌లో అద్భుతమైన వైద్య సేవలందించాలి
- ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు:
‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ అనేది కేవలం ప్రచార ఆర్భాటం కాదని.. దీని అమలులో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పనితీరు మార్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే.. ‘గరం.. నరం.. బేషరమ్’గా వ్యవహరించాల్సి వస్తుందని అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో దాదాపు మూడు గంటల పాటు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి రూపొందించిన ‘క్యూర్, ప్యూర్, రేర్’ పాలసీలను పక్కాగా అమలు చేయాలని, ప్రతి ఐఏఎస్ అధికారి నెలలో కనీసం మూడు సార్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ప్రణాళిక ఉండాలనే ఉద్దేశంతోనే విజన్ 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేశామని సీఎం గుర్తుచేశారు.
గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్లో కీలక శాఖలకు నిర్దిష్ట పాలసీ లేకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని.. ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుతూ పాలసీలు తెచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఎంత గొప్ప ప్రణాళికలు రచించినా.. అవి నూటికి నూరు పాళ్లు విజయవంతం కావాలంటే అధికారుల సహకారం, సమన్వయం తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే రూ. 3 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 40 శాతం రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన 60 శాతం నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల పురోగతిని ఎప్పటికప్పుడు డాష్ బోర్డుల ద్వారా పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
అద్దె భవనాలకు ‘మంగళం’..జనవరి 26 డెడ్‌లైన్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26లోపు అద్దె భవనాల్లో ఉన్న ఆఫీసులన్నీ ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని సూచించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే, వెంటనే ఖాళీ స్థలాలను గుర్తించి సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలోని 113 మున్సిపల్ ఆఫీసులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
ప్రజలకు సేవలు అందించే ఆఫీసులు పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల పూర్తి వివరాలను జనవరి 26 నాటికి సీఎస్‌కు అందించాలని సీఎం ఆదేశించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఈపీఎఫ్ ( సక్రమంగా అందుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, డేటా విషయంలో తేడా వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఫైల్ పట్టుకుని తిరగొద్దు..ఇక అంతా ఈ-ఫైలింగే
కాగితాలు, ఫైళ్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి పోవాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో జనవరి 31 లోగా ‘ఈ-ఫైలింగ్’ విధానం అమలులోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌లైన్ విధించారు. ప్రతి శాఖ తమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ‘డాష్ బోర్డు’ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీనిని సీఎస్, సీఎంవో డాష్ బోర్డులకు అనుసంధానించాలని ఆదేశించారు. ‘‘రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతవరకు గ్రౌండ్ అయ్యాయో ప్రతి నెలా సమీక్షించుకోవాలి. పరిశ్రమలకు భూసేకరణ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించాలి” అని సీఎం సూచించారు.
అన్ని మెడికల్కాలేజీల్లోమెరుగైన సేవలు అందించాలి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ ను మెరుగైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. నిమ్స్ తరహాలో సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, వరంగల్ హాస్పిటళ్లు, ఉస్మానియా కొత్త ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని వసతులతో తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. మెడికల్ కాలేజీ హాస్పిటళ్లను కూడా ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ కు అనుసంధానం చేయాలని సూచించారు. అక్కడ సేవలందించే డాక్టర్లు, సిబ్బందికి కూడా సర్జరీలు, ప్రత్యేక సేవలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలన్నారు.
కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలుండాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎస్రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్‌లు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
ప్రతి నెలా రిపోర్ట్ ఇవ్వాల్సిందే..
ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతరం నిఘా ఉంటుందని సీఎం తెలిపారు. ప్రతి నెలా కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్ష నిర్వహిస్తారని, ప్రతి మూడు నెలలకోసారి స్వయంగా తానే సమీక్ష జరుపుతానని చెప్పారు. ‘‘అన్ని శాఖల కార్యదర్శులు తమ శాఖల పురోగతిపై ప్రతి నెలా సీఎస్‌కు నివేదిక ఇవ్వాలి. ఐఏఎస్ అధికారులు ఏసీ గదులకే పరిమితం కాకుండా ప్రతి పది రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలి.
నెలలో కనీసం మూడు సార్లు తమ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవల్‌లో పరిశీలించాలి. ఇప్పటికంటే పనితీరు మరింత మెరుగుపడాలి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే లక్ష్యాలను అలవోకగా ఛేదించగలం. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయానికి ఒక ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి”అని సీఎం సూచించారు.
