జీవితాంతం ఆడలేం.. ఒక్క గాయంతో కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగిసే ప్రమాదం: సింధు

జీవితాంతం ఆడలేం.. ఒక్క గాయంతో కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగిసే ప్రమాదం: సింధు

గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌: క్రీడల్లో రాణించాలనుకునే ఔత్సాహికులకు మంచి విద్య కూడా ఉండాలని ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌, రెండుసార్లు ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ విజేత పీవీ సింధు సూచించింది. కేవలం క్రీడలపైనే దృష్టిసారించడం చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. ఎందుకంటే ఒకే ఒక్క గాయం వల్ల క్రీడా కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగిసిపోయే అవకాశం ఉందని చెప్పింది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎదుర్కొన్న అనేక అంశాలను ఇందులో ప్రస్తావించింది. ‘నేను ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నా. ఏదో ఒక సమయంలో క్రీడలకు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించాల్సిందే కదా. అదే నిజం కూడా. మనకు 45, 50, 60 ఏళ్లు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో క్రీడలు ఆడలేం. ఆ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. అదే చదువు కూడా ఉంటే.. అది జీవితాంతం మనతోనే ఉంటుంది’ అని సింధు పేర్కొంది.

ప్లేయర్ల తల్లిదండ్రులు విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నేషనల్‌‌‌‌‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ పుల్లెల గోపీచంద్‌‌‌‌‌‌‌‌ వెల్లడించిన అభిప్రాయంతో సింధు ఏకీభవించింది. ‘ప్రతి ఒక్కరూ బంగారు స్పూన్‌‌‌‌‌‌‌‌తో జన్మించలేరు. చదువులోనైనా, క్రీడల్లోనైనా సరే మనం కష్టపడి శ్రమించాల్సిందే. చదువు, క్రీడలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఎంబీఏ పూర్తి చేశా. స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ చదువును కొనసాగించడం అంత తేలిక కాదనే విషయం నాకు తెలుసు. ఉదయాన్నే ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లడం, మళ్లీ వచ్చి చదువుకోవడం, ఆపై సాయంత్రం సెషన్లకు వెళ్లడం.. ఇలా చాలా రోజులు కొనసాగుతుంది. ఇక్కడ మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి. జీవితాంతం క్రీడల్లో కొనసాగలేం. చదువు కూడా ఉంటే నిబ్బరంగా ఉండొచ్చు. క్రీడలు ముఖ్యమే కానీ.. వాటి కోసమే చదువును పూర్తిగా ఆపేయకూడదు’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించింది.

గాయాలతో ఇబ్బందే..
క్రీడల్లో అయ్యే గాయాల నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుందని సింధు చెప్పింది. అందుకే ఇప్పుడు క్రీడల్లోకి వస్తున్న ప్లేయర్లు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు చదువును కలిగి ఉండటం వల్ల చాలా మేలు జరుగుతుందని తెలిపింది. ‘నేను చెప్పేది కఠినంగా అనిపించొచ్చు. ఈ విషయం ఇప్పుడు వారికి అర్థం కాకపోవచ్చు. కానీ జీవితంలో తర్వాతి దశల్లో చదువు కూడా ముఖ్యమే అని గుర్తిస్తారు. ఎందుకంటే క్రీడలు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతాయి. గాయాల వల్ల కెరీర్‌‌‌‌‌‌‌‌కే ఇబ్బంది తలెత్తొచ్చు. గాయం ఎప్పుడు ఎలా అవుతుందో కూడా ఊహించలేం.

ఒకే ఒక్క గాయంతో క్రీడా కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగిసిపోవచ్చు. సర్జరీలు అవసరం పడొచ్చు. కాబట్టి జీవితంలో దేనికైనా మనం సిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. 2016 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ముందు నేను గాయపడ్డా. కొన్ని రోజుల పాటు నొప్పిని భరిస్తూనే ఆడా. డాక్టర్ల దగ్గరకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం వెంటాడేది. మళ్లీ జీవితంలో ఆడతానో లేదో కూడా తెలియదు. కానీ సరిగ్గా సమయానికి డాక్టర్లను కలిసి చికిత్స తీసుకున్నా. దాని నుంచి కోలుకుని ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగా’ అని సింధు వ్యాఖ్యానించింది.