హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలను గుర్తించి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌పై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం (డిసెంబర్ 3) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. బహుజన సామ్రాజ్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న పునాదులు వేశారని అన్నారు. 2001లో హుస్నాబాద్ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004న కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. 60 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని సోనియా గాంధీని ఆహ్వానించామని తెలిపారు.
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్పూర్తితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ అంటే తనకు సెంటిమెంట్ అని మాజీ సీఎం కేసీఆర్ చెబుతారు.. కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హుస్నాబాద్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కేసీఆర్‌కు నిజంగా హుస్నాబాద్‌పై ప్రేమ ఉంటే గౌరెల్లి రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే డెవలప్ అయ్యాయని విమర్శించారు. కుండపల్లి, గౌరెల్లి రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత నాదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
