వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించాలి: డీకే అరుణ

వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించాలి: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలపై ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో కేసీఆర్  సర్కారు ఫెయిలైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. వర్షాలపై కనీసం రివ్యూ చేసే తీరిక కూడా సీఎంకు లేకపోవటం బాధాకరమన్నారు. సీఎం స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా ఇవ్వాలని, వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలన్నారు.  వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న తమ నేత బూర నర్సయ్య గౌడ్ ను అడ్డుకోవడం దారుణ మన్నారు. డల్లాస్ సంగతేమో కానీ.. హైదరాబాద్ ను తండ్రీకొడుకులు ఖల్లాస్ గా మార్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారిందని, వెంటనే రోడ్లకు రిపేర్లు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు.