డీఎంకే నేత వ్యాఖ్యల వ్యవహారం : స్టాలిన్ కు ఖుష్బూ ప్రశ్న

డీఎంకే నేత వ్యాఖ్యల వ్యవహారం : స్టాలిన్ కు ఖుష్బూ ప్రశ్న

డీఎంకే నేత సైదై సాదిఖ్ బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ పై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళికి ఆమె ట్వీట్ ట్యాగ్‌ చేశారు. దానికి కనిమొళి స్పందించి ఖుష్బూకు క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో సైదై సాదిక్‌ కూడా ఖుష్బూకు ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేశారని వివరణ ఇచ్చారు. అయినా ఖుష్బూ మనసు గాయపడి ఉంటే క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు.

అయితే ఈ వ్యాఖ్యలపై ఖుష్బూ ఇంకా సీరియస్‌ గానే ఉన్నారు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయన స్పందించకుండా ఉంటే అర్థం ఏంటి?.. మౌనం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. స్టాలిన్‌ తనకు ఈ విషయంలో అండగా నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాంటి నాయకుడిని పార్టీ నుంచి తక్షణమే స​స్పెండ్‌ చేయడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు. ఆ నాయకుడిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని, తన పరువు, గౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతానని ఖుష్బూ తెలిపారు.