గౌరవెల్లి ప్రాజెక్టు సీసీ కెమెరాలు బాగు చెయ్యండి: ఇరిగేషన్​ శాఖకు జీఆర్ఎంబీ లెటర్

గౌరవెల్లి ప్రాజెక్టు సీసీ కెమెరాలు బాగు చెయ్యండి: ఇరిగేషన్​ శాఖకు జీఆర్ఎంబీ లెటర్

హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదని, వాటిని వెంటనే బాగు చేయాలని నీటిపారుదల శాఖను గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్​ఎంబీ) కోరింది. కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతున్నదో తెలియడం లేదని బుధవారం కరీంనగర్​ఈఎన్సీకి రాసిన లేఖలో జీఆర్ఎంబీ మెంబర్​సెక్రటరీ రంగసామి అళగేశన్​ పేర్కొన్నారు. 

నేషనల్ ​గ్రీన్​ ట్రిబ్యునల్​ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారులతో జీఆర్ఎంబీ సమావేశమై ప్రాజెక్ట్​ సైట్​ వద్ద 7 సీసీటీవీలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతున్నదో జీఆర్ఎంబీ ఆఫీసుకు సీసీటీవీల నుంచి ట్రాన్స్​మిటర్​ ద్వారా తెలిసేదన్నారు. కానీ, ప్రాజెక్ట్​ సైట్​ను సందర్శించిన సందర్భాల్లో కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. 

సీసీటీవీల నుంచి డేటాను పంపించేందుకు ఉపయోగపడే జీఎస్ఎం నెట్​వర్క్​లు ఎక్స్​పైరీ అవడం వల్ల కొన్ని నెలలుగాఎలాంటి సమాచారమూ రావడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా  వాటిని బాగు చేయలేదన్నారు. జులై 4న ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పు ఉన్నందున.. ఈ అంశాన్ని సీరియస్​గా తీసుకోవాలని, వెంటనే వాటిని బాగు చేయాలని లేఖలో  కోరారు.