దోస్తులకు దోచిపెడ్తున్నడు: మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్

దోస్తులకు దోచిపెడ్తున్నడు: మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్

రాయ్​బరేలీ(యూపీ): ప్రజల సంపదను మోదీ ప్రభుత్వం సంపన్నులకు దోచిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16 లక్షల కోట్ల రుణాన్ని మోదీ మాఫీ చేయించారని ఆరోపించారు. అదానీ, అంబానీ లాంటి వ్యాపారవేత్తలతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. బీజేపీ లీడర్లంతా రాహుల్ గాంధీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయ్​బరేలీలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.

‘‘అదానీ, అంబానీల గురించి రాహుల్ గాంధీ రోజూ మాట్లాడుతున్నడు. దేశ సంపదను వాళ్లకు మోదీ ఎలా దోచిపెడ్తున్నారో ప్రజలకు వివరిస్తున్నడు. అదానీ, అంబానీల గురించి రాహుల్ మాట్లాడటమే మానేశాడంటూ మోదీ చేసిన కామెంట్లను ఖండిస్తున్న. ముగ్గురి మధ్య ఉన్న రహస్య స్నేహం గురించి, దాని వెనుక దాగి ఉన్న కుట్ర గురించి రాహుల్ మీ ముందు పెడ్తున్నడు. బిగ్ బిలియనీర్స్​కు చెందిన రూ.16లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది నిజం కాదా? ఇదంతా ఎవరి డబ్బు? మోదీ డబ్బు కాదు.. మన డబ్బు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించిన డబ్బు’’ అని ప్రియాంక అన్నారు.

ప్రజలను తన బానిసలనుకుంటున్నరు

బీజేపీ లీడర్లు ఎవరూ ఇన్​ఫ్లెయేషన్, నిరుద్యోగం గురించి మాట్లాడటంలేదని ప్రియాంక గాంధీ అన్నారు. ఎక్కడి కెళ్లినా మతం, కులం, గుడులు, మసీదుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందడంలేదన్నారు. ‘గవర్నమెంట్​లో 30 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉద్యోగాలు భర్తీ చేసే స్కీమ్​లు తీసుకురాలేదు. అదీగాక, యువత కన్న కలలు నాశనం చేశారు. రాజ్యాంగాన్ని మోదీ మార్చాలనుకుంటున్నరు. రాయ్​బరేలీతో మా ఫ్యామిలీకి కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది’ అని గుర్తుచేశారు.

అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తం

భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశారని ప్రియాంక అన్నారు. కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్, మణిపూర్ నుంచి ముంబై దాకా యాత్ర చేశారని తెలిపారు. దేశ రాజకీయాలు సరైన మార్గంలో వెళ్లడం లేవన్నారు. యూపీఏ అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్​ను రద్దు చేస్తామని తెలిపారు. ఆర్మీ జవాన్లు అంటే మోదీకి ప్రేమ లేదన్నారు. పాత పద్ధతి ప్రకారమే యువతను రిక్రూట్​మెంట్ చేసుకుంటామన్నారు.