హైదరాబాద్‌‌లో సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం.. ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్‌‌లో సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం.. ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్​, వెలుగు: టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (టీ--–చిప్) సంస్థ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశంలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ కేంద్రాన్ని పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 

ఇది సాధారణ మ్యూజియంలా కాకుండా,  ఇన్నోవేషన్ హబ్​గా పనిచేస్తుంది. ఇందులో ప్రతి నెలా కొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. దీనిలో భాగంగా నెలాఖరులో "చిప్ డెమో డే" నిర్వహిస్తారు.   ఇన్నోవేటర్స్ తమ ఆవిష్కరణలను పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించి నిధులు, భాగస్వామ్య అవకాశాలు పొందవచ్చు. 

తైవాన్, జపాన్, అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చిన ఆధునిక టెక్నాలజీలను ప్రదర్శించడానికి  ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ జోన్లను ఏర్పాటు చేశారు. మొదటి ప్రదర్శనలో ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ ఏఐ చిప్, హ్యూమనాయిడ్ రోబోట్లు, అధునాతన ఈవీ బ్యాటరీ టెక్నాలజీలు వంటి ఆవిష్కరణలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. టీ–-చిప్ చైర్మన్ సందీప్ కుమార్  మాట్లాడుతూ, ఇది భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిప్ వినియోగదారుడిగా కాకుండా, చిప్ సృష్టికర్తగా నిలబెడుతుందని తెలిపారు. ఈ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు.