గ్రామకంఠంలో ని ఖాళీ స్థలాలు పరిశీలన

గ్రామకంఠంలో ని ఖాళీ స్థలాలు పరిశీలన

గజ్వేల్/తూప్రాన్, వెలుగు: ఏళ్ల తరబడి ఇండ్లు, వాటి చుట్టూ ఉన్న స్థలాలకు సరైన రికార్డులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని సీఎం కేసీఆర్​నిర్ణయించారని సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్​చెప్పారు. శుక్రవారం ఆమె సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలం అంగడి కిష్టాపూర్, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ లో పర్యటించారు. గ్రామకంఠంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. అంగడి కిష్టాపూర్​లో అప్పర్​ప్రైమరీ స్కూల్​లో స్టూడెంట్లతో ముచ్చటించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు ఇంటి స్థలాలన్నీ సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినవేనని అన్నారు.

గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉన్న పేర్లకు, ప్రస్తుతం ఆయా ఇళ్లలో ఉన్నవారికి పొంతన లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఆధీనంలో ఉన్నవారికి లబ్ధి కలిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. డ్రోన్ ద్వారా గ్రామం మొత్తం సర్వే చేస్తామని, ముందుగా ప్రభుత్వ స్థలాలను గ్రామపంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేసి ప్రైవేటు ఇళ్లను, ఖాళీ స్థలాలను వివాదాలకు తావులేకుండా యాజమాన్య హక్కులు కల్పించేలా చూస్తామన్నారు. గ్రామంలో సర్వే చేసేటప్పుడు ప్రజలు వారి ఇల్లు, స్థలాలకు సంబంధించి గతంలో ఉన్న పత్రాలను అధికారులకు చూపించి సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్లు ప్రశాంత్​జే పాటిల్,  హరీశ్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, డీపీవో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.