V6 News

మొండికేస్తున్న మిల్లర్లు.. మిల్లర్ డిఫాల్టర్గా తేలితే కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు..

మొండికేస్తున్న మిల్లర్లు.. మిల్లర్ డిఫాల్టర్గా తేలితే కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు..
  • ఈసారి సీఎంఆర్​నిబంధనల్లో మార్పులు.. 
  • నూక శాతం 25 నుంచి 10 శాతానికి తగ్గింపు.. వ్యతిరేకిస్తున్న మిల్లర్లు 
  • కొనుగోలు సెంటర్ల నుంచి వెళ్తున్న వడ్లు దింపుకోకుండా నిరసన
  • అవసరమైతే​ గోదాముల్లో పెడ్తామంటున్న సివిల్ ​సప్లై అధికారులు
  • మిల్లర్ల  బ్లాక్​మెయిల్​కు మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం

హైదరాబాద్​ /నల్గొండ, వెలుగు: కస్టమ్​ మిల్లింగ్​ రైస్​(సీఎంఆర్​)నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ మిల్లర్లు కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్ల లోడ్​లను దింపుకోకుండా నిరసన తెలుపుతున్నారు. కొత్త సీఎంఆర్​ పాలసీ ప్రకారం ఎవరైనా మిల్లర్ డీఫాల్టర్ గా తేలితే వారితో పాటు వారి కుటుంబసభ్యులపై సైతం ఆర్ఆర్ యాక్ట్  ప్రయోగించి, ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. 

దీనికితోడు యాసంగిలో గతంలో 25 శాతం నూకతో సీఎంఆర్​ అనుమతించగా, ఇప్పుడు దానిని 10శాతానికి తగ్గించడంపై మిల్లర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  బాయిల్డ్ రైస్ పైనా గతంలో ఉన్న 15గా ఉన్న నూకశాతాన్ని  5శాతానికి తగ్గించడాన్ని తప్పు పడ్తున్నారు. మారిన నిబంధనలను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి వడ్లు దింపుకోకుండా మిల్లర్లు  మొండికేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

  • డీఫాల్టర్ గా  తేలితే కుటుంబ సభ్యుల ఆస్తులూ జప్తు

 గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిల్లర్లకు ఎలాంటి ష్యూరిటీలేకుండా సీఎంఆర్ ధాన్యం కేటాయించడంతో పలువురు వేల కోట్ల విలువైన వడ్లను పక్కదారి పట్టించి, సివిల్​సప్లై శాఖకు తీవ్ర నష్టం కలిగించారు. అలాంటివారిపై ఆర్ఆర్​యాక్ట్​ప్రయోగిస్తే, అంతకుముందే ఆస్తులను కుటుంబసభ్యుల పేర్ల మీదికి మార్చి వేడుకచూస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్​ పక్కదారి పట్టకుండా కొత్త సీఎంఆర్​పాలసీ తెచ్చింది. దీని ప్రకారం మిల్లర్లు అగ్రిమెంట్​ సమయంలో బ్యాంక్​గ్యారెంటీతోపాటు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ కేటాయించకుండా  డీఫాల్టర్ గా మారితే మిల్లు యజమానితో పాటు వారి కుటుంబ సభ్యులపైనాఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి ఆస్తులను జప్తు చేయవచ్చు. ఈ నిబంధనను మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

  •  నూకశాతంపై గరం గరం.. 

యాసంగిలో గతంలో 25 శాతం నూకతో సీఎంఆర్​ అనుమతించగా, ఇప్పుడు దానిని 10శాతానికి తగ్గించడంపైనా మిల్లర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి  దింపుకునే ప్రతి 100 కేజీల ధాన్యానికి మిల్లర్లు.. బాయిల్డ్​ రైస్​ 68 కేజీలు,  రా రైస్​ అయితే 67 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో రారైస్​లో 25శాతం, బాయిల్డ్​ రైస్​లో 15శాతం నూకను అనుమతించేవారు. ఇప్పుడు 67కేజీల రారైస్​లో 10శాతం నూకను, 68 కేజీల బాయిల్డ్​ రైస్ లో 5శాతం నూకను మాత్రమే  అనుమతిస్తామని  నిబంధన విధించారు. 

దీనిని సైతం మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యాసంగి సీజన్ లో వచ్చే వడ్లను రా రైస్ గా మారిస్తే 70  శాతం వరకు నూకలు వస్తాయని, కనుక  ప్రభుత్వం నిర్దేశించిన క్వాంటిటీలో రా రైస్ ఇవ్వడం సాధ్యం కాదంటున్నారు. 10శాతం నూకతో మొత్తానికి మొత్తం  బాయిల్డ్​ఇస్తామని తేల్చి చెప్తున్నారు. దీనిపై సివిల్​ సప్లై అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మిల్లర్లు దింపుకోక పోతే  ధాన్యాన్ని  ఇంటర్మీడియట్​ గోదాముల్లో పెడ్తామని, మిల్లర్ల  బ్లాక్​మెయిల్​కు మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేస్తున్నారు. 

  • మరో విడత చర్చలు..

ధాన్యం దింపుకోవడానికి మిల్లర్లు మొండికేస్తుండడంతో చాలాచోట్ల వడ్ల కొనుగోళ్లు వేగం పుంజుకోవడం లేదు.  రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు సెంటర్లు తెరవాలని నిర్ణయించగా, ఇప్పటి వరకూ 2వేల సెంటర్లు మాత్రమే ఓపెన్​అయ్యాయి. ఆ సెంటర్లలోనూ ఇప్పటివరకు కేవలం 33వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. కొన్న ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలిస్తున్నా ధాన్యం దింపుకోకపోవడంతో ఆయా చోట్ల  జిల్లా అధికారులు మిల్లర్లతో నూకశాతంపై చర్చలు జరుపుతున్నారు. పలు జిల్లాల్లో సోమవారం జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో  మంగళవారం మరోసారి చర్చలు జరగనున్నాయి.