మిల్లర్ల నుంచి సివిల్​ సప్లయ్​కి అందని సీఎంఆర్​ బియ్యం

మిల్లర్ల నుంచి సివిల్​ సప్లయ్​కి అందని సీఎంఆర్​ బియ్యం
  • ఈ నెలాఖరు లోపు ఇవ్వాలని అధికారుల ఆర్డర్​ 
  • లక్ష 70వేల మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్​


నిర్మల్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి ఇవ్వడంలో జిల్లాలోని పలు రైస్ మిల్ యాజమాన్యాలు మొండికేస్తున్నాయి. రెండేళ్ల నుంచి తాము ఇవ్వాల్సిన కస్ట మ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వడం లేదు. పౌరసరఫరాల శాఖ పలుసార్లు యజమానులకు నోటీసులు జారీ చేసి, బియ్యం తిరిగి ఇచ్చేందుకు గడువు కూడా విధించింది. ఇలా ఇప్పటికే మూడు నాలుగు సార్లు గడువు ఇచ్చినప్పటికీ రైస్ మిల్లర్లు మాత్రం సీఎంఆర్ బియ్యంను తిరిగి ఇవ్వడం లేదు. చిట్టచివరగా ఈ నెలాఖరు వరకు మొ త్తం   బియ్యం తిరిగి చెల్లించాలంటూ ఇటీవలే ప్రభుత్వం మిల్లర్ల ను  హెచ్చరించింది. 


భారీ మొత్తంలో బియ్యం .. 

2021– 22 రబీ సీజన్ నుంచీ ఇటీవలే ముగిసిన ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పెద్ద మొత్తంలో సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మిల్లర్లు మిల్లింగ్ కెపాసిటీ, ఇతరత్రా సాంకేతిక కా రణాలను చూపుతూ దాటవేస్తున్నారు. దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ రైస్ మిల్లర్లు సిండికేట్ అయి రబీ బియ్యాన్ని ఖరీఫ్ కు, ఖరీఫ్ బియ్యాన్ని మళ్లీ రబీ కి ఇలా వరుసగా సీజన్లు మార్చి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి.

రికవరీ పై సందేహాలు ...

 2021- –22 రబీ సీజన్ లో మొత్తం 98,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లర్లకు అందించగా ఆ ధాన్యానికి సంబంధించి 66,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే మిల్లర్లు ఇప్ప టివరకు కేవలం 30 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే సర్కారుకు ఇచ్చారు. మిగతా 37 వేల ఎం టీ ఎస్ ల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 32 రైస్ మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యాన్ని ఇవ్వగా కేవలం ఐదు రైస్ మిల్లులు మాత్రమే పూర్తి సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ఇచ్చాయి. మిగతా 27 రైస్ మిల్లులు బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ రైస్ మిల్లులకు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు కోసం నెలాఖరు వరకు గడువు విధించారు.


ఈసారి రబీలో ధాన్యం దిగుబడులు అధికమే 

రబీ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా  లక్ష 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో   జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు   90 లారీలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అయితే రైస్​ మిల్లుల్లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని ఈ నెలాఖరులోగా రికవరీ చేస్తారా లేదో వేచి చూడాలి