
- కాళేశ్వరానికి జాతీయ హోదా ఎక్కడ పాయే?
- రాజకీయ విభేదాలుంటే హక్కులు తాకట్టు పెడతరా
- మమత, స్టాలిన్ వాళ్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవట్లేదా?
జగిత్యాల, వెలుగు : రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనలకు సీఎం కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం తీరు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మోడీతో రాజకీయ విభేదాలున్నా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో మూతపడ్డ మూడు ఎరువుల కర్మాగారాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. మోడీ మెప్పు కోసం ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ప్రతి బిల్లుకు 2019 దాకా టీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. మంచిర్యాల–హైదరాబాద్ మధ్య ఉన్న రాజీవ్రాహదారిని ఎనిమిది లేన్లుగా విస్తరించాలనే ప్రతిపాదన ఉందని, మోడీ దృష్టికి తీసుకెళ్లి సాధించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ దే అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అవకాశం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ అహంకార ధోరణి తో రూ.లక్ష కోట్ల అప్పు తెలంగాణ ప్రజలపై పడిందన్నారు. ‘‘అల్వాల్, జూబ్లీ బస్టాండ్‌ను లింక్ చేసే ఫ్లైఓవర్ కట్టేందుకు కంటోన్మెంట్ ల్యాండ్ అవసరం ఉంది. దానిని సాధించాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా? దాంతోపాటు పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని మోడీ దృష్టికి తీసుకువెళ్లి సాధించుకోవాల్సి ఉంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 20 లక్షల మందికి మేలు జరిగేది. మమతా బెనర్జీ, స్టాలిన్ కు మోడీతో రాజకీయ విబేధాలున్నా.. వారు తమ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదు” అని జీవన్ రెడ్డి అన్నారు.