- ఇండియన్ ఎనర్జీ సమిట్ లో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్
హైదరాబాద్, వెలుగు: దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి మరో నాలుగు దశాబ్దాల పాటు డిమాండ్ ఉండే అవకాశం ఉందని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 'ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో' కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన భారత ఇంధన భద్రత~విద్యుత్ ఉత్పత్తి అనే గోష్టిలో ఆయన మాట్లాడారు.
రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, పునరుత్పాదక ఇంధన రంగంలోనూ సంస్థ తన బాధ్యత నిర్వర్తిస్తుందని బుద్ధ ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్, సోలార్‌తో పాటు క్రిటికల్ మినరల్ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లు వెల్లడించారు.ఈ చర్చకు ప్రొఫెసర్ పవన్ కుమార్ పరనంది సమన్వయ కర్తగా వ్యవహరించారు.
ఎనర్జీ సమిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ హాజరుకాగా.. ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి చైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్తాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ శర్మ, గ్రిడ్ కో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సత్యప్రియ రథ్, ఒడిశా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ కేదార్ రంజన్ పాండు, చత్తీస్ గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ ఎండీ సంజీవ్ కుమార్ కటియార్
తదితరులు పాల్గొన్నారు.
