- టన్ను బొగ్గుకు రూ.15 చొప్పున జమకు ఒకే
- సీఎంపీఎఫ్ బలోపేతానికి చాన్స్
మందమర్రి, వెలుగు : బొగ్గు గని కార్మికుల పెన్షన్ ఫండ్‌కు తమవంతు సహకారాన్ని మరింత పెంచేందుకు బొగ్గు పరిశ్రమలు నిర్ణయించాయి. ఇప్పటివరకు ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10 చొప్పున పెన్షన్ఫండ్కు జమ చేస్తున్న సంస్థలు మరో రూ.5 కలిపి ఇకపై టన్నుకు రూ.15 చొప్పున చెల్లించనున్నాయి. బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల పెన్షన్‌పై మంగళవారం నాగ్‌పూర్‌లో కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) బోర్డ్ఆఫ్ట్రస్టీల సమావేశం నిర్వహించారు. కీలక పెన్షన్ ఫండ్‌కు బొగ్గు పరిశ్రమల నుంచి మరింత సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్లుగా కోలిండియా, సింగరేణి సంస్థలు ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10 చొప్పున చెల్లిస్తుండగా కొత్తగా తీసుకున్న నిర్ణయంతో పెన్షన్ ఫండ్ ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది. బోర్డు ఆఫ్ ట్రస్టీలు ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ ప్రతిపాదనను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. అనంతరం ఇది అమలులోకి వస్తుంది. ప్రస్తుతం అదనపు సాయం వల్ల ఆర్థిక సమస్యలు దూరం కావడంతో పాటు ఫండ్ మరింత బలోపేతం కానుంది.
రెండేళ్ల కిందట రూ.10 చొప్పున..
బొగ్గు గని కార్మికులు రిటైరైనపుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా 1998 సంవత్సరంలో అప్పటి కేంద్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) కోల్ మైన్స్పెన్షన్స్కీం అమలులోకి తీసుకువచ్చారు. క్రమంగా బొగ్గు గని ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో పెన్షన్ ఫండ్(నిధి)కు జమయ్యే సొమ్ము తగ్గుతూ వచ్చింది. చెల్లింపులు గణనీయంగా పెరగడంతో రెండేళ్ల కిందట సీఎంపీఎఫ్‌లో సుమారు రూ.26 వేల కోట్ల లోటుతో పెన్షన్ స్కీం ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకు నవంబర్ 2020లో జాయింట్ బైపార్టైట్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) సుదీర్ఘమైన చర్చలు జరిపి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇందులో బొగ్గు పరిశ్రమలు ప్రతి టన్ను బొగ్గుకు రూ.10 చొప్పున పెన్షన్ ఫండ్‌కు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కోలిండియాతో పాటు సింగరేణి కంపెనీ కూడా ఉత్పత్తి చేస్తున్న ప్రతి టన్ను బొగ్గుకు రూ.10 చొప్పున జమ చేస్తూ వస్తున్నాయి. దీంతో సీఎంపీఎఫ్ ఫండ్లోటు క్రమేణా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం పెన్షన్ట్రస్ట్బోర్డుకు కోలిండియా నుంచి 88 శాతం, సింగరేణి 9.7, సెయిల్, జిందాల్, టాటా సంస్థల నుంచి 2.3 శాతం చొప్పున మొత్తం 100 శాతం ఫండ్స్ అందుతున్నాయి. పరిశ్రమలు, ఉద్యోగుల భాగస్వామ్యం, కేంద్రం రూ.1600 బేసిక్ వేతనంపై 1.16శాతం చొప్పున రూ.27 జమతో పెన్షన్ స్కీం కొనసాగుతోంది.
టార్గెట్చేరితే రూ. వంద కోట్ల జమ
దేశవ్యాప్తంగా ఏటా సుమారు 765 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. రెండేళ్లుగా సింగరేణి సంస్థ ఏటా రూ.60 నుంచి రూ.65 కోట్ల వరకు సీఎంపీఎఫ్ ఫండ్‌కు జమ చేస్తోంది. కోలిండియా సుమారు రూ.650 కోట్లవరకు చెల్లిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం కోలిండియా యాజమాన్యం 710 మిలియన్ టన్నులు, సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్‌గా నిర్ధాయించుకున్నాయి. సింగరేణి సంస్థ ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి టార్గెట్చేరితే టన్నుకు రూ.15 చొప్పున సీఎంపీఎఫ్పెన్షన్ఫండ్కు రూ.100 కోట్ల వరకు జమ చేయనుంది. కోలిండియాలో కూడా 700 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వల్ల మరో రూ.1000 కోట్లకు పైగా పెన్షన్ ఫండ్‌లో జమ చేసే చాన్స్ఉంది. కోలిండియాతో పాటు సింగరేణిలో ప్రస్తుతం పెన్షన్ ప్రయోజనం పొందుతున్నవారు 3.50 లక్షల వరకు ఉంటారు. వీరిలో కొంత మందికి మాత్రమే రూ.15,000 వరకు పెన్షన్చెల్లిస్తున్నారు. ఎక్కువ మంది రిటైర్డు ఉద్యోగులు అతి తక్కువ పెన్షన్ పొందుతున్నారు. బొగ్గు పరిశ్రమల అదనపు సాయం నేపథ్యంలో తమకు పెన్షన్ పెంచాలని రిటైర్డు ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు.
‘ఖని’లోనే సీఎంపీఎఫ్ ఆఫీస్
గోదావరిఖని: గోదావరిఖనిలో ఉన్న కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలించే నిర్ణయాన్ని బోర్డు ఆఫ్ ట్రస్టీ(బీఓటీ) వెనక్కి తీసుకుంది. సింగరేణి పరిధిలోని దాదాపు 50 వేల మంది కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు ఆఫీస్ తరలింపు వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి సీఎండీ సెంట్రల్ కోల్ సెక్రెటరీ, బీఓటీ మెంబర్లకు లెటర్లు రాయడంతో మంగళవారం నాగ్‌పూర్‌లో జరిగిన మీటింగ్‌లో ఆఫీస్ తరలింపు అంశాన్ని ఏజెండా నుంచి తొలగించారు. దీంతో సీఎంపీఎఫ్ ఆఫీస్ తరలింపునకు బ్రేక్ పడినట్టైంది.
