
- క్వాలిటీ లేక కొనేవాళ్లు కరువు
- జేకే ఓసీ కార్మికులకు బదిలీలు, డిప్యుటేషన్ల టెన్షన్
- పూసపల్లి ఓసీకి అడ్డంకిగా భూ నిర్వాసితులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లయిన బొగ్గుట్ట(ఇల్లెందు)ను పుట్టెడు కష్టాలు వెంటాడుతున్నాయి. బొగ్గు తవ్వకాలు నిలిచి బోసిపోతోంది. ఈ ఏరియాలోని బొగ్గు క్వాలిటీ లేకపోవడంతో కొనేవాళ్లు కరువయ్యారు. దీంతో ఇల్లెందులోని జేకే ఓపెన్‌కాస్ట్‌లో 2 నెలలుగా బొగ్గు తవ్వకాలను తగ్గిస్తూ వచ్చి ఇటీవల పూర్తిగా ఆపేశారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేయనున్న పూసపల్లి(జేకే ఓపెన్కాస్ట్ఎక్స్టెన్షన్) ఓసీకి భూ నిర్వాసితులు పెద్ద సమస్యగా మారారు. భవిష్యత్తులో బొగ్గుట్టలో బొగ్గు బాయిలు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందేమోనని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
135 ఏండ్ల చరిత్ర
సింగరేణి బొగ్గు బాయిలను 135 ఏండ్ల కింద భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో అప్పటి బ్రిటీష్ పాలకులు ప్రారంభించారు. బొగ్గు పుట్టిన ప్రాంతం కావడంతో ఇల్లెందును బొగ్గుట్ట అని పిలిచేవారు. కొన్ని దశాబ్దాల పాటు పదుల సంఖ్యలో మైన్స్, వేల సంఖ్యలో కార్మికులతో కళకళలాడింది. మూడు దశాబ్దాలుగా మైన్స్తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం టేకులపల్లి మండలంలో కోయగూడెం ఓసీతోపాటు ఇల్లెందులో జేకే –5 ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇల్లెందు ఏరియాలో ప్రస్తుతం700 లోపే కార్మికులు పని చేస్తున్నారు.
గ్రేడ్–14, 15 రకం బొగ్గు..
నాడు సూపర్ గ్రేడ్ బొగ్గు నిల్వలకు నిలయమైన బొగ్గుట్ట ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. బొగ్గు క్వాలిటీ తక్కువ, టన్ను రూ.2,540 ఉండటంతో కొనేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. జేకే–5లో గ్రేడ్–14, 15 రకం బొగ్గు ఉత్పత్తి అవుతోంది. బూడిద శాతం ఎక్కువగా వస్తోందంటూ థర్మల్పవర్స్టేషన్లు ఈ బొగ్గును తీసుకోవడం లేదు. మైన్స్పరిసర ప్రాంతాల్లో దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో గల ఇటుక బట్టీలకు బొగ్గు అమ్మకాలు చేయకూడదన్న నిబంధన కూడా ఉంది.
ఫలితంగా ఈ ఓపెన్‌కాస్ట్‌లో కొన్ని రోజులుగా బొగ్గు తవ్వకాలు ఆపేశారు. బాయి ఉపరితలం మీద దాదాపు 4 వేల టన్నుల బొగ్గు అమ్మకానికి రెడీగా ఉంది. ఓపెన్‌కాస్ట్‌లో బ్లాస్టింగ్ చేసిన బొగ్గు దాదాపు 40 వేల టన్నులు ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. అయినా క్వాలిటీ లేని కారణంగా ఏరియా మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. బొగ్గు తవ్వకాలు ఆగిపోవడంతో ఈపీ ఆపరేటర్లతోపాటు పలు కేటగిరీలకు చెందిన 57 మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్, డిప్యుటేషన్‌పై పంపేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది. దీనిపై మైన్ నోటీస్ బోర్డులో ప్రకటన వేయడంతో వారు కలవరపడుతున్నారు.
పూసపల్లి ఓసీ ఎక్స్టెన్షన్..
జేకే ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు నిల్వలు అయిపోతుండటంతో పూసపల్లి ఓపెన్ కాస్ట్ పేరుతో ఎక్స్టెన్షన్కు యాజమాన్యం ప్లాన్చేసింది. ఇటీవల స్టేజ్-–1కు పర్మిషన్స్వచ్చాయి. స్టేజ్–2 కు అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఈ మైన్ ఏర్పాటులో భాగంగా కొంత ఫారెస్ట్ ల్యాండ్ అవసరమైంది. అయితే ఇందులో ఏండ్లుగా కొందరు సాగు చేసుకుంటున్నారు. విజయలక్ష్మి నగర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో సింగరేణి ల్యాండ్స్‌లో పలువురు దశాబ్దాల కింద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
తమను భూ నిర్వాసితులుగా గుర్తించి పరిహారం ఇవ్వాలని వారు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇల్లెందు బొగ్గుకు మార్కెట్లో ధర లేకపోవడంతో మైన్‌ను ప్రారంభించే విషయంలో యాజమాన్యం పునరాలోచనలో పడింది. కాగా సింగరేణి పుట్టింటిని కాపాడేందుకు యాజమాన్యం పూసపల్లి బొగ్గు బాయిని ఓపెన్ చేయాలని స్థానికులతోపాటు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.