గోదావరి  మహోగ్రరూపం

గోదావరి  మహోగ్రరూపం

మేడిగడ్డ వద్ద 28.40 లక్షల క్యూసెక్కుల వరద  36 ఏండ్ల తర్వాత ఇదే అత్యధికం
జయశంకర్‌‌ భూపాలపల్లి/భద్రాచలం, వెలుగు:  గోదావరి వరద ఉధృతి మరింతగా పెరిగింది. వారం రోజులుగా కురుస్తున్న వానలతో ప్రవాహం పెరిగి వందలాది గ్రామాలు, వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. 36 ఏండ్ల తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో వరద ప్రవహిస్తోంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ దగ్గర గురువారం ఒకే సారి 28.40 లక్షల క్యుసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో నీటిలో చిక్కుకున్న సుమారు 20 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాచలం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు కరెంట్‌‌ సరఫరా నిలిచిపోయింది. ‌భద్రాచలంలో పోలీసులు144 సెక్షన్‌‌ విధించారు. గోదావరి బ్రిడ్జిపై రాకపోకలను బంద్‌‌ చేశారు. గోదావరి మహోగ్రరూపానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగంగా నిర్మించిన కన్నెపల్లి(లక్ష్మి), అన్నారం( సరస్వతి) పంప్‌‌హౌస్​లు నీట మునిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది.

రికార్డుస్థాయిలో వరద
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద ఉన్న గోదావరి నదిలో 1986లో 28 లక్షల క్యుసెక్కుల వరద నమోదైనట్లుగా జల సంఘం ఆఫీసర్లు తెలిపారు. గురువారం ఈ రికార్డు కనుమరుగైంది. సాయంత్రం 4 గంటల సమయంలో మేడిగడ్డ వద్ద 28.40 లక్షల క్యుసెక్కుల ఔట్‌‌ ఫ్లో నమోదైంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి ప్రతీ గంట గంటకు గోదావరిలో ఇన్‌‌ఫ్లో పెరుగుతూ వచ్చింది. ఎస్సారెస్పీ నుంచి మొదలుకొని అన్నారం బ్యారేజీ వరకు గేట్లు తెరిచిపెట్టడం, గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు నదులు ఒప్పొంగడంతో గురువారం పొద్దున 22.15 లక్షల క్యుసెక్కుల వరద ఉండగా..మధ్యాహ్నం ఒంటి గంటకు 25.66 లక్షల, 3 గంటలకు 27.88 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.  దీంతో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంచిర్యాల జిల్లాల్లో గోదావరి గట్టు దాటి ప్రవహించడం స్టార్లయ్యింది. ఎటూ కిలోమీటర్‌‌ వెడల్పుతో ప్రవహించడంతో లక్షలాది ఎకరాల పంట భూములు నీట మునిగాయి. 

భయం గుప్పిట్లో తీర ప్రాంతవాసులు
భూపాలపల్లి జిల్లాలో గోదావరి వరద ఉధృతి వల్ల పలిమెల మండలంలోని ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఈ మండల ప్రజలకు వారం రోజులుగా బహిరంగ సమాజంతో సంబంధాలు తెగిపోయాయి. మండలకేంద్రంలోని పోలీస్‌‌ స్టేషన్‌‌లోకి కూడా నీళ్లు చేరడంతో పోలీసులు తమ తుపాకులు తీసుకుని బయటికి వెళ్లిపోయారు. మహాదేవ్‌‌పూర్‌‌ మండలంలోని గోదావరి తీర ప్రాంతాల ప్రజల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాళేశ్వరం పుష్కరఘాట్‌‌ నుంచి కిలోమీటర్‌‌ వరకు వరద రాగా గోదావరి తీరంలో ఉన్న గ్రామాలన్నీ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. మహాముత్తారం మండల కేంద్రానికి సమీపంలో భారీ వర్షాలకు రోడ్డు డ్యామేజ్ కావడంతో పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైపులైన్​పగిలిపోయింది. దీంతో కాటారం, మహాదేవపూర్, మల్హర్​, పలిమెల, మహాముత్తారం మండలాలకు మిషన్ భగీరథ నీళ్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహాదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద ఉంటున్న 14 కుటుంబాల్లోని 53 మంది వరదలో చిక్కుకోగా వీరిని పోలీసులు కాపాడి క్షేమంగా పునరావాస కేంద్రానికి చేర్చారు. పలిమెల గ్రామంలోకి భారీగా వరద నీరు వస్తుండడంతో ఐదు ట్రాక్టర్లను పంపించి గ్రామాన్ని ఖాళీ చేసి మహా ముత్తారం మండలం పెగడపల్లి పునరావాస కేంద్రానికి పంపించారు. పంకేన గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కూడా గోదావరి వరద చేరడంతో అక్కడి నుంచి మరోచోటికి ప్రజలను చేరవేశారు. ఇంటికంటే అడవి మేలని ప్రజలు కొందరు గుట్టల పైకి చేరుతున్నారు. చాలామంది తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు వారికి సహాయక చర్యలు అందించడానికి ఎన్ డీఆర్ఎఫ్​ బృందాలు ప్రయత్నిస్తున్నప్పటికీ అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

భద్రాచంలో ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరికలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉధృతి మరింత ఉంది. సాయంత్రం ఇక్కడ 62.2 మీటర్ల మేర గోదావరి ప్రవాహం రికార్డయ్యింది. గోదావరి చరిత్రలోనే ఏడోసారి 60 అడుగుల నీటిమట్టం దాటింది. భద్రాచలం టౌన్​ను వరద చుట్టేసింది. టౌన్​లోని రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్ వద్ద షాపుల్లోకి, చప్టా దిగువకు వరద చేరింది. మరో వైపు అయ్యప్ప, సుభాష్​నగర్​ కాలనీల్లోకి కూడా వరద పోటెత్తింది. దీంతో ఆయా కాలనీల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. విజయవాడ-‒జగదల్​పూర్​ జాతీయ రహదారిపైకి, ఎంవీఐ ఆఫీసు వద్దకు వరద నీరు చేరింది. సీఆర్​పీఎఫ్​ క్యాంపు వెనక భాగం, వృద్ధాశ్రమం వద్దకు కూడా కరకట్ట కింద నుంచి నీళ్లు వచ్చాయి. ప్రస్తుత రిజర్వాయర్ల నుంచి విడుదలవుతున్న నీరు, వర్షాలు అంచనా కట్టి 70 అడుగులకు వరద వస్తుందని కలెక్టర్ అనుదీప్​అలర్ట్ చేశారు. భద్రాచలం నుంచి చత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలతో పాటు, వాజేడు,వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ఖమ్మం,కొత్తగూడెం వైపులకు మాత్రమే రోడ్డు క్లియరెన్స్ ఉంది. జిల్లాలోని 7 మండలాల్లోని 61 గ్రామాలు, కొత్తగూడెంలోని కిన్నెరసాని ప్రాంతం కూడా ముంపుకు గురైంది. జిల్లా వ్యాప్తంగా 9,846 మందిని 48 పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంలో ప్రజలెవ్వరూ బయటకురాకుండా 144సెక్షన్ అమలు చేస్తున్నారు.  భద్రాచలం వంతెనపై రాకపోకలను నిలిపేశారు. 

మంచిర్యాల జిల్లాలో జలదిగ్బంధంలో 20 గ్రామాలు
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల చెన్నూరు, జైపూర్‌‌, కోటపల్లి మండలాల్లో సుమారు 20 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 10 గ్రామాల్లోకి పూర్తిగా నీరు వచ్చింది. సుమారు3 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంచిర్యాలలో 15 కాలనీలు, చెన్నూరులో 2 కాలనీలు నీటమునిగాయి. చెన్నూర్‌‌ మండలంలో ఎన్‌‌హెచ్‌‌ 63 రోడ్డు పైనుంచి గోదావరి వరద ప్రవహిస్తోంది. కోటపల్లి మండలం సోమన్‌‌పల్లిలో గోదావరి వరద ఉధృతిలో చిక్కుకుపోయిన ఇద్దరిని హెలీకాఫ్టర్‌‌ ద్వారా కాపాడారు. చెన్నూరు, కోటపల్లి మండలాలతో పాటు 70 గ్రామాలకు కరెంట్‌‌ సరఫరా నిలిచిపోయింది. ప్రజలంతా చీకట్లోనే మగ్గిపోతున్నారు. ఈ జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.