కాఫీ ప్యాకెట్లలో కొకైన్

కాఫీ ప్యాకెట్లలో కొకైన్
  • వాట్సాప్‌‌లో ఆర్డర్స్‌‌, కమీషన్స్‌‌తో సప్లయ్
  • సన్‌‌సిటీ అడ్డాగా నైజీరియన్‌‌ డ్రగ్స్ దందా
  • ముగ్గురు అరెస్ట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: కాఫీ ప్యాకెట్లలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్ గుట్టును ఎక్సైజ్​ అధికారులు రట్టు చేశారు. లోకల్ సప్లయర్స్‌‌తో కలిసి డ్రగ్స్ సేల్‌‌ చేస్తున్న నైజీరియన్​తో పాటు ఇద్దరు కస్టమర్లను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.28 లక్షలు, 56 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌‌ ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ విజయ్‌‌కుమార్‌‌‌‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

స్టూడెంట్‌‌ వీసాతో వచ్చి కొకైన్ సప్లయర్‌‌‌‌గా..
ఆఫ్రికాలోని ఘనాకు చెందిన మారిస్ బసాగ్రియ(28) ఫార్మసీ స్టూడెంట్ వీసాపై 2019లో ఇండియా వచ్చాడు. రాజేంద్రనగర్‌‌‌‌ సన్‌‌సిటీలోని గోల్డెన్ వ్యాలీ వెంచర్‌‌‌‌లో ఉంటూ, సిటీ శివారులోని ఓ కాలేజ్‌‌లో చదువుతున్నాడు. ఈజీ మనీ కోసం ఢిల్లీలోని నైజీరియన్‌‌తో కలిసి సిటీలో కొకైన్‌‌ సప్లయ్ చేయడానికి ప్లాన్ చేశాడు. కాఫీ ప్యాకెట్స్‌‌లో కొకైన్ ఉంచి సేల్‌‌ చేస్తున్నాడు. గ్రాము కొకైన్‌ను రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్ముతున్నాడు. లోకల్‌‌ కస్టమర్లకు కమీషన్స్‌‌ ఇచ్చి చైన్‌‌ ఏర్పాటు చేసుకున్నాడు.

దొరికింది ఇలా..
వాట్సాప్‌‌లో ఆర్డర్స్‌‌ తీసుకుని మెహిదీపట్నం, టోలీచౌకి, వనస్థలిపురం సహా సిటీలోని కస్టమర్లకు డ్రగ్స్​ సేల్‌‌ చేస్తున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటలకు దూల్‌‌పేట్‌‌కు చెందిన సందీప్‌‌కుమార్‌‌‌‌ షా(22)కు 7 గ్రాముల కొకైన్ అమ్మాడు. జుమ్మేరాత్‌‌ బజార్‌‌‌‌ దర్తీ మాత టెంపుల్‌‌  వద్ద డ్రగ్స్ సప్లయ్‌‌ చేస్తున్నారనే సమాచారంతో దూల్‌‌పేట్‌‌ ఎక్సైజ్‌‌ అధికాలు సెర్చ్‌‌ చేసి, మారిస్‌‌, సందీప్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 గ్రాముల కొకైన్‌‌, రూ.94 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిచ్చిన సమాచారంతో అప్పటికే డ్రగ్స్‌‌ కొన్న సయ్యద్‌‌ లియాకత్‌‌ను తజియాగూడ వద్ద అదుపులోకి తీసుకొని, 11 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. చార్మినార్‌‌‌‌కు చెందిన మసాలా వ్యాపారి యజ్ఞానంద్‌‌కు డ్రగ్స్​ సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించారు. సన్‌‌సిటీలోని మారిస్‌‌ ఫ్లాట్‌‌లో సెర్చ్‌‌ చేసి ప్యాకింగ్‌‌కు సిద్ధంగా ఉన్న 50 కాఫీ ప్యాకెట్స్‌‌ గుర్తించారు. 38 గ్రాముల కొకైన్‌‌, రూ.33 వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న యజ్ఞానంద్‌‌ కోసం గాలిస్తున్నారు.