స్టూడెంట్ల జీవితాలతో ‘గురునానక్’​ యాజమాన్యం చెలగాటం

స్టూడెంట్ల జీవితాలతో ‘గురునానక్’​ యాజమాన్యం చెలగాటం
  • కాలేజీ ముందు ఎన్ఎస్ యూఐ ఆందోళన 
  • బల్మూరి వెంకట్ అరెస్ట్, బెయిల్ మంజూరు

ఇబ్రహీంపట్నం, వెలుగు: అనుమతులు రాకుండానే యునివర్సిటీ పేరుతో బోర్డు పెట్టి ఇబ్రహీంపట్నం గురునానక్​కాలేజీ యాజమాన్యం 2022లో 4 వేల మంది స్టూడెంట్లను జాయిన్​చేసుకుందని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టూడెంట్లకు ఎగ్జామ్స్​పెట్టలేదని చెప్పారు. గురువారం కాలేజీ ముందు ఆందోళనకు దిగిన బాధిత స్టూడెంట్ల తల్లిదండ్రులకు బల్మూరి వెంకట్, పలువురు నాయకులు మద్దతు తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీసులు వచ్చి వెంకట్ తోపాటు పలువురిని అరెస్ట్​చేశారు.

రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పారు. చివరికి మారుమూల పోలీస్ స్టేషన్ అయిన మాడ్గుల పీఎస్​కు వెంకట్​ను తరలించారు. మాడ్గుల పీఎస్​లో వెంకట్ ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పరామర్శించారు. శుక్రవారం బల్మూరి వెంకట్ తోపాటు మరో ముగ్గురిని జడ్జి ముందు హాజరుపరచగా, ఒక్కొక్కరికి 30 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. అనంతరం బల్మూరి వెంకట్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నం చౌరస్తాలోని డాగ్​బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. స్టూడెంట్ల జీవితాలతో గురునానక్ కాలేజీ యాజమాన్యం ఆటలాడుతోందన్నారు. స్టూడెంట్లకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తమను పోలీసులు అరెస్ట్​చేయడం కరెక్ట్​కాదన్నారు. స్టూడెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గురునానక్ విద్యాసంస్థలపై కేసులు నమోదు చేయాలన్నారు.