కమలం  పార్టీలో ఆ నలుగురు..ఒకరంటే ఒకరికి పడదు

కమలం  పార్టీలో ఆ నలుగురు..ఒకరంటే ఒకరికి పడదు
  •  కిషన్ రెడ్డి, లక్ష్మణ్​, బండి, ఈటల ఎవరి దారి వాళ్లదే
  • అమిత్ షా వార్నింగ్ ఇచ్చినా తీరు మారలే
  •  పీక్స్ వెళ్లిన గ్యాప్.. కన్ఫ్యూజన్ లో కేడర్
  • పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా?
  • హైకమాండ్ చెప్పినట్లు 10 సీట్లు వస్తాయా?

హైదరాబాద్: బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. నలుగురు నేతలు ఎవరికి వారుగా తమ వర్గాలను పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. నలుగురు కీలక నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో పార్టీ కేడర్ లో అయోమయం నెలకొంది.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సమన్వయం లోపించిందనేది బహరింగంగానే వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 35 సీట్లు సాధిస్తామనేది బీజేపీ సర్వేల్లో తేలింది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఈ నలుగురు నేతలు కలిసి పనిచేయడం లేదని క్యాడర్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ గ్యాప్ పీక్స్ కు వెళ్లింది. నాయకులు కనిపిస్తే చాలు వాళ్లు ఏ వర్గం వారనే గుసగుసలు అక్కడే వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు ఇన్ చార్జీలు కూడా వారి మధ్య గ్యాప్ సెట్ చేయలేక పోతున్నారనే వాదన బలంగా ఉంది. ఎడమొఖం, పెడమొఖంగా ఉ న్న ఈ నేతలతో  పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే హైకమాండ్ ఆదేశించినట్టుగా 10 సీట్లు గెలవడం కష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది. 

షా వార్నింగ్ ఇచ్చినా..

బీజేపీలో నేతల మధ్య సమన్వయం లోపించడాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. గత ఏడాది డిసెంబర్ 28న హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో సమావేశం నిర్వహించారు. నేతలంతా సమన్వయంతో సాగాలని 10 పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో అంతర్గత అంశాలపై ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు చెప్పాలని సూచించారు. అయితే ఈ మీడియా సమావేశానికి బండి సంజయ్ గైర్హాజరవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి నేతల మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో కూడా నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్​ ఎవరికి వారుగా ప్రెస్ మీట్ లు పెట్టుకోవడం వెళ్లిపోవడం రివాజుగా మారింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ నలుగురు ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగా ఉండటంతో కేడర్ కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు.