- 21 జిల్లాల్లో 14 డిగ్రీల రేంజ్‌లో ఉష్ణోగ్రతలు
- అత్యల్పంగా నిర్మల్‌లో 14.6 డిగ్రీలకు డౌన్
- హైదరాబాద్‌లో 15 డిగ్రీలకు పతనమైన పరిస్థితి
- మూడు రోజుల్లో 11-12 డిగ్రీలకు పడిపోయే చాన్స్
- 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సాయంత్రం 6 గంటల నుంచే చలి పంజా విసురుతోంది. మొన్నటిదాకా ఉక్కపోతతోపాటు 20 డిగ్రీలకుపైగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. రెండు రోజుల్లోనే ఒకేసారి 15 డిగ్రీల దిగువకు చేరాయి. ఏకంగా 21 జిల్లాల్లో 14 డిగ్రీల రేంజ్‌లోనే టెంపరేచర్లున్నాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో 14.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 14.8, హనుమకొండ, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో 14.9, నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 15 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వరంగల్, ఖమ్మం, ములుగు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 15.1 డిగ్రీలు, నారాయణపేట, హైదరాబాద్‌లలో 15.2, వనపర్తిలో 15.4, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 16.3 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్‌లోనూ టెంపరేచర్లు పతనమవుతున్నాయి. నాగోల్, ఆదిభట్ల, రాజేంద్రనగర్, కీసర, ఫలక్‌నుమ, అమీన్‌పూర్‌లలో 15.1 డిగ్రీల చొప్పున రాత్రిపూట చలి తీవ్రత ఉన్నది.
మరింత పతనం..
రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రమంతటా చలిగాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. టీజీడీపీఎస్ అంచనాల ప్రకారం.. రాత్రి ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల దిగువకు పడిపోయే అవకాశాలున్నాయి. మూడు రోజుల్లో అది 11–12 డిగ్రీల మేర రికార్డయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఆసిఫాబాద్, గద్వాల, వరంగల్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 12 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో అది మరింత బలపడుతుందని అంచనా వేసింది.
