- ప్రాజెక్టుల ఒరిజినల్ డిజైన్లు, అనుమతుల వివరాలు సమర్పించండి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సంబంధించి కేంద్రం ఆమోదించిన అసలు డిజైన్లు(ఒరిజినల్ అప్రూవల్స్), ఆ తర్వాత రెండు రాష్ట్రాలు కాలక్రమేణా చేసిన మార్పులు చేర్పులు, అదనంగా చేపట్టిన ప్రాజెక్టులు/స్కీంల సమగ్ర సమాచారాన్ని అధికారిక రికార్డులతో సహా సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది.
ప్రాజెక్టుల అసలు బేస్‌లైన్‌ను రికార్డుల్లో నమోదు చేయాలంటే ఈ వివరాలు తప్పనిసరని తేల్చిచెప్పింది. ఇప్పటికే ఆ వివరాలు ఇవ్వాలని అడిగామని పేర్కొంటూ.. తాజాగా రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. రెండు ప్రాజెక్టుల అసలు స్వరూపాన్ని నిర్ధారించేందుకు కేడబ్ల్యూడీటీ-–1(కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ట్రిబ్యునల్– బచావత్ ట్రిబ్యునల్) చేసిన కేటాయింపులు, ఆ సమయంలో అనుమతి పొందిన ప్రాజెక్టుల ఫ్రేమ్‌వర్క్ మాత్రమే ప్రాతిపదికగా కొనసాగుతుందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రాజెక్టుల అసలు స్కోప్, డిజైన్లు తెలిస్తేనే.. ఆ తర్వాత జరిగిన మార్పులు, అదనంగా పెరిగిన నీటి అవసరాలను గుర్తించి సాంకేతికంగా పరిశీలించడానికి వీలవుతుందని బోర్డు స్పష్టం చేసింది.
నీటి డ్రాయల్స్, ఆయకట్టు వివరాలు కూడా..
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ప్రారంభంలో అనుమతించిన పరిధి, కాంపోనెంట్లు, ఎడమ, కుడి కాల్వల ఆఫ్‌టేక్‌లు, వాటి అసలు హైడ్రాలిక్ వివరాలు, డిజైన్ ప్రకారం నిర్దేశించిన నీటి డ్రాయల్స్, ఆయకట్టు వివరాలను కూడా ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డు ఆదేశించింది. వీటికి సంబంధించిన నాటి టీఏసీ(టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ), టీఈసీ(టెక్నికల్ఎవాల్యుయేషన్ కమిటీ) నోట్స్‌తోపాటు ప్రాజెక్ట్అసలైన అప్రైజల్ఆర్డర్స్ కాపీలను సమర్పించాలని సూచించింది.
ఇక, తొలుత అనుమతించిన హైడ్రాలిక్ వివరాలకు భిన్నంగా సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తి కోసం కాల్వల సామర్థ్యాన్ని ఏమైనా పెంచారా? కొత్తగా చేర్చిన అదనపు స్కీంలు ఏంటి? వాటి డిజైన్లు, లక్ష్యాలు, డిపెండబిలిటీ, ఆయా పథకాలకు అదనంగా అవసరమయ్యే నీటి పరిమాణం ఎంత? అనే వివరాలను పూర్తి ఆధారాలతో సమర్పించాలని పేర్కొంది. ప్రాజెక్టుల్లో చేసిన మార్పులకు లేదా కొత్తగా చేపట్టిన అదనపు స్కీంలకు సంబంధిత కేంద్ర అథారిటీల నుంచి సాంకేతిక ఆమోదం, క్లియరెన్సులు, అనుమతులు ఉన్నాయా? ఉంటే వాటికి సంబంధించిన పూర్తి రికార్డులను ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసింది.
శ్రీశైలంలో 11, సాగర్‌లో 2 అనుమతి లేని కాంపోనెంట్లు
2021 జులై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ ప్రకారం శ్రీశైలంలో 11, నాగార్జునసాగర్‌లో 2 కాంపోనెంట్లు/స్కీంలు అనుమతి లేని జాబితాలో ఉన్నాయని కేఆర్ఎంబీ ప్రస్తావించింది. ప్రాజెక్టుల పరిధిలోనూ మార్పులు జరిగినట్లు పేర్కొంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) కేటాయింపులు తేల్చే వరకు ప్రాజెక్టుల అప్రైజల్, రీ-అప్రైజల్‌పై సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు కోరినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా బేస్‌లైన్ నమోదు కోసం రెండు రాష్ట్రాల ఈఎన్సీలు ఆలస్యం చేయకుండా పూర్తి రికార్డులు సమర్పించాలని సూచించింది.
