- దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టం లేక లీడర్లతో పైరవీలు
- సరిపడా టీచర్లు లేక ఇబ్బందులు పడ్తున్న విద్యార్థులు
- ఆర్డర్లొచ్చినా కొత్త బడుల్లో చేరని వారిపై సర్కారు సీరియస్
- యూ-డైస్ లో వివరాలు నమోదు చేయని డీఈవోలపైనా చర్యలు?
- ఈ నెల 16 నుంచి 23 దాకా జిల్లాలవారీగా సమీక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ‘మిగులు టీచర్ల’ సర్దుబాటు వ్యవహారం విద్యాశాఖకు తలనొప్పిగా మారింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్ల నుంచి టీచర్లు లేక ఇబ్బంది పడుతున్న బడులకు రెండేళ్లుగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు. గతేడాది సుమారు 6 వేల మందిని అడ్జస్ట్ చేయగా.. ఈ ఏడాది ఇప్పటికే 7,300 మందికి డిప్యుటేషన్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఆర్డర్లు చేతికొచ్చినా చాలామంది టీచర్లు తమకు కేటాయించిన బడుల్లో చేరకుండా మొండికేస్తున్నారు. దూరం సాకుతో కొందరు, వ్యక్తిగత కారణాలతో మరికొందరు జాయిన్ కావడానికి ససేమిరా అంటున్నారు.
ఈ క్రమంలోనే ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయిస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వేలాది స్కూళ్లలో పాఠాలు చెప్పే టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో జాప్యం, పోర్టల్‌లో నమోదు చేయని డీఈవోల తీరుపైనా విద్యాశాఖ గుర్రుగా ఉంది. తాజాగా తమకు కేటాయించిన స్కూళ్లలో చేరని టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఉత్తర్వులు తీసుకుని పాత బడుల నుంచి రిలీవ్ అయినప్పటికీ.. కొత్తగా కేటాయించిన స్కూళ్లలో ఇప్పటివరకు రిపోర్ట్ చేయని టీచర్లు సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిలీవైన వెంటనే విధుల్లో చేరని ఇలాంటి టీచర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన వివరాలను వెంటనే డైరెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు.
లీడర్ల ఫోన్ కాల్స్.. డీఈవోలపై ప్రెజర్
కొత్త బడులకు వెళ్లడం ఇష్టంలేని కొందరు టీచర్లు రాజకీయ ఒత్తిళ్లను ఆశ్రయిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో విద్యాశాఖ డైరెక్టర్‌తో పాటు డీఈవోలకూ ఫోన్లు చేయిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ జిల్లాలో తమ పరిధిలోని టీచర్ల సర్దుబాటుపై ఓ మంత్రి ఏకంగా డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే గ్రేటర్ శివారులోని ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధి నుంచి టీచర్లను ఇతర ప్రాంతాలకు పంపవద్దంటూ డీఈవోకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదని, క్షేత్రస్థాయిలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు వాపోతున్నారు. సర్దుబాటు అయిన టీచర్ల వివరాలను యూ-డైస్ పోర్టల్‌లో నమోదు చేయడంలో పలు జిల్లాలు నిర్లక్ష్యం వహించడంపైనా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతలోనే ఈనెల7 లోగా పూర్తి సమాచారం పంపాలని ఆదేశించినా పలు జిల్లాలు నివేదికలు ఇవ్వలేదు. పెండింగ్‌లో ఉన్న సర్దుబాటు ప్రక్రియను మంగళవారం నాటికి పూర్తి చేయాలని డీఎస్ఈ గడువు విధించారు.
16 నుంచి జిల్లాలవారీగా సమీక్షలు
టీచర్ల సర్దుబాటు, వారి చేరికల పురోగతిని తేల్చేందుకు ఈ నెల 16 నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్లు, క్లస్టర్ మానిటరింగ్ ఆఫీసర్లు పక్కా రికార్డులతో ఈ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు, 17న నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, 18న భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, 19న ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, హనుమకొండ జిల్లాలు, 20న ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలు, 21న రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి, ఈనెల 23న సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమీక్ష నిర్వహించనున్నారు.
