ఎల్‌నినోతో తెలంగాణలో కరువు తీవ్రమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ తెలంగాణకు సమృద్ధిగా ఉన్న ప్రకృతి వనరులను పట్టించుకోకపోవడంతోనే రాష్ట్రం కరువుకు గురవుతోంది. ప్రధానంగా భౌగోళికంగా చూస్తే తెలంగాణకు కరువు అనేది పాలకుల నిర్లక్ష్యం వల్లనేనని తెలుస్తుంది. సాధారణంగా దక్షిణ తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఉత్తరం వైపుగా వెళ్తున్నకొద్దీ ఎక్కువ వర్షపాతం చూస్తాం. ఎల్‌నీనో ప్రతి ఐదు, ఆరు సంవత్సరాలకు ఒకసారి రావడంతో వర్షపాతం తగ్గిపోతుంది. దాంతో కరువు రాష్ట్రాన్ని చుట్టేస్తుంది. రాష్ట్ర ప్రజలు ప్రతిసారి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. సమస్యను సులభంగా అధిగమించడానికి రాష్ట్రంలో రెండు జీవనదులు ఉన్నాయి. నదులలో ప్రవహించే నీటిని అభివృద్ధి చేస్తే తెలంగాణకు కరువు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ నీటిపారుదలను పాలకులు దోపిడీ దృక్పథంతో చూడటంతో ప్రజలు కరువుతో ఇబ్బంది పడాల్సివస్తుంది. తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు నదీజలాల అభివృద్ధి మీద పెద్దఎత్తున బడ్జెట్ మళ్లించినప్పటికీ నీటిపారుదలలో తెలంగాణ వెనుకబడిపోయింది.
మొదటి పది సంవత్సరాల పాలకులు నీటిపారుదల మీద అవసరానికి మించి ప్రచారం చేశారు. సాధారణ వర్షాలతో వ్యవసాయం మెరుగుగా సాగడంతో పంట దిగుబడి పెరిగింది. కానీ మా వల్లనే అది సాధ్యమైందని బీఆర్‌ఎస్ ప్రచారం చేసుకుంది. వారి వల్లనే 16 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగు నీరందించినట్లు రాష్ట్రాన్ని భ్రమింపజేశారు. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక లక్ష ఎకరాలలోపే అదనపు పారుదల జరిగినట్లు తెలుస్తున్నది. రూ.38,000 కోట్ల అంచనాతో మొదలైన మేడిగడ్డ ప్రాజెక్టు 1,50,000 కోట్లకు చేరినప్పటికీ తెలంగాణ ప్రజలకు పెద్దగా ఉపయోగం కలగలేదు.
వాస్తవానికి కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ హయాంలో రూ.38000 కోట్లతో ప్రాణహిత (ఆదిలాబాద్‌లోని తుమ్మిడిహెట్టి) నుంచి చేవెళ్లవరకు చేపట్టిన ప్రాజెక్టుపైన 17 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ ఆ ప్రాజెక్టును పక్కకుపెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంతో ముందుకుపోయింది. మొదటగా చేపట్టిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కొనసాగించి ఉంటే ఈరోజు తెలంగాణ ఇబ్బందులు తగ్గేవి. అదేవిధంగా కృష్ణానది మీద చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, డిండి, అచ్చంపేట, పాలమూరు-– రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తిచేసి ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు బీటలువారడంతో పాలకుల ధనదాహం బద్దలైంది.
బీఆర్‌ఎస్ అవినీతి
నీటి పారుదలతోపాటు తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగినది విద్యుత్ ఉత్పత్తి. అందుకు అనుకూలమైన సింగరేణిలో బొగ్గు గనులు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బొగ్గు గనుల పిట్ హెడ్లకు సమీపంగా నెలకొల్పితే ఎంతో ఖర్చును తగ్గించుకోవచ్చని సాధారణ బొగ్గు గని కార్మికునికి కూడా తెలుసు. దీనికి విరుద్ధంగా విదేశాలలో లభించే గ్రేడ్ 9 బొగ్గు ఆధారిత యాదాద్రి థర్మల్ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. రూ.17వేల కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు రూ.37వేల కోట్లకు చేరింది. ఒకవైపు నిర్మాణ ఖర్చులను రెండింతలకు పెంచడం, రెండోవైపు దూరప్రాంత బొగ్గు దిగుమతికి అయ్యే రవాణా ఖర్చులను విద్యుత్ ఉత్పత్తి మీద భారం మోపడం వల్ల ప్రజలు ఎక్కువ ఖరీదుతో విద్యుత్తును కొనుగోలు చేయడం బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా సమర్థించుకుంటారు?. బీఆర్ఎస్ ఎక్కడ చేయి పెడితే అక్కడ అవినీతే. తెలంగాణ ఉద్యమ ముసుగులో రాష్ట్రాన్ని దోచేయడం, రాష్ట్ర ప్రజలను వెనుకబాటులో ఉంచడం బీఆర్‌ఎస్ పాలకుల లక్ష్యంగా కనిపిస్తున్నది.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ మారిందా?
నీటిపారుదల అభివృద్ధి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ముసుగులో ప్రజల సొమ్మును దోచుకుని పాలకుల ప్రైవేట్ ఆస్తులను పెంచుకునేందుకు బాగా తోడ్పట్టు కనిపిస్తున్నది. పాలకవర్గం, ఇంజినీరింగ్ బ్యూరోక్రసీతోపాటు ఆంధ్ర కాంట్రాక్టు సంస్థలు, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు తమ ఆస్తులను పెంచుకోడానికి సులభమైన మార్గంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది. 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ కరప్షన్ కాలువలలో పారుతూ కుంటలను నింపుకున్నట్టుగా జరిగింది. అందుకేనేమో బీఆర్‌ఎస్ నాయకులు ప్యాలెస్‌లను కట్టుకున్నారు. స్టార్ హోటళ్ల వ్యాపారాన్ని మొదలపెట్టిండ్రు. పలువురు పార్టీ నాయకులు బిలియనీర్లుగా మారిండ్రు.
గొప్ప నాయకులుగా అవతారమెత్తిండ్రు. మళ్లీ మేం వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని వారి సొంత చానల్లో, పెయిడ్ సోషల్ మీడియా చానళ్లల్లో ప్రచారం చేసుకుంటుండ్రు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు వీరి అవినీతి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ఏమైనా మారిందా? వీరి అభివృద్ధి ప్రాధాన్యతలను చూస్తే వాళ్లకు తెలంగాణ అర్థమైనట్లు కనిపించడం లేదు. గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ సమస్యను ఒక కరువు సమస్యగా చూడలేకపోయారు. వర్షాకాలం మొదలుకాకముందే ఎల్‌నినోతో రాష్ట్రం తీవ్ర కరువుకు గురవుతుందని వాతావరణ శాఖలు హెచ్చరించినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వీరి ఆలోచనలను చూస్తే ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు భిన్నంగా కనిపిస్తుంది.
కొనసాగుతున్న పేదరికం, సామాజిక వెనుకబాటుతనం
తెలంగాణ అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచీకరణ ద్వారా ప్రాధాన్యత సంతరించుకున్న బిజినెస్ మోడల్ కేంద్రంగా ముందుకుపోతున్నారు. బిజినెస్ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులను రప్పిస్తే తెలంగాణ దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా మారుతుందని చెపుతున్నారు. కరువు తీవ్రంగా ఉన్నా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్, మూసీనది సుందరీకరణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలుగా నిత్యం ప్రచారంలో ఉన్నాయి. అందుకోసం బిజినెస్ సమిట్‌ల పేరుతో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించడమే ప్రభుత్వ పాలసీగా మారింది.
కానీ వారు గుర్తించాల్సింది ఈ బిజినెస్ మోడల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫెయిల్ అవుతున్నట్లు చూడలేకపోతున్నారు. పేదరికం, సామాజిక వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. సేవారంగంను ప్రైవేటీకరించడంతో విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో లేకుండాపోతుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పేదలను, గ్రామీణ మధ్యతరగతిని పలు సమస్యలకు గురిచేస్తోంది. కరువుతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసినప్పటికీ కరువు అనేది తెలంగాణ ప్రధాన సమస్యగా తీసుకొని ముందుకుసాగుతున్నట్లు కనిపించడం లేదు. మూడేళ్ల ముందు నుంచే తుమ్మిడిహెట్టి ప్రాధాన్యతను గుర్తించాల్సింది!
అవినీతి జరిగినా చర్యలు శూన్యం
పాలక వర్గాల ధనదాహంతోనే తెలంగాణ ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకుల ఆలోచనలలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. దేశంలోనే తెలంగాణ.. అవినీతి రాష్ట్రాలలో ఒకటిగా ముందుకుసాగుతోంది. భూకబ్జాలు, గ్రానైట్ మైనింగులు, ఇసుక తరలింపులు, కాంట్రాక్టర్ల వ్యవస్థలు, అవినీతి అధికారులతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఉద్యమ పాలకుల అవినీతి రాష్ట్ర ప్రధాన సమస్యలలో ఒకటిగా నిలిచింది.
పలు ఇన్వెస్టిగేషన్లు అవినీతి జరిగిందని తేల్చినా నేటి పాలకులు అనుకున్న మేరకు చర్యలు చేపట్టకుండా ఉపన్యాసాలకే పరిమితమైనట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండు పార్టీల ప్రభుత్వాలను చూసిన ప్రజలు మూడో జాతీయ పాలక పార్టీ (బీజేపీ) వైపు చూస్తే తెలంగాణ ప్రజల జీవితం పెనం మీద నుంచి పొయ్యిలోపడ్డట్టు అవుతుంది. ధనప్రవాహంతో కూడిన ప్రచార వ్యవస్థలు ప్రజలను అయోమయంలోకినెట్టి మళ్లీ పాత నాయకత్వాన్ని కోరుకునేవిధంగా ప్రేరేపిస్తున్నాయి. ప్రజలు వాస్తవాల కేంద్రంగా ఆలోచించాలి. శాశ్వత కరువు పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ప్లానింగ్‌తో ప్రభుత్వం ముందుకు నడవాలి.
- ప్రొ. ఎస్. సింహాద్రి యాదవ్
రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్‌వాది పార్టీ, తెలంగాణ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
