హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక ఆధారాలు పరిశీలించకుండానే క్రిమినల్ కేసుల్లో నిందితులకు సమన్లు జారీ చేసేలా మేజిస్ట్రేట్లు కాగ్నిజెన్స్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసుల అభియోగ పత్రాలు, ఫిర్యాదుల్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించకుండా మూస పద్ధతిలో ఆర్డర్స్జారీ చేయడం సరికాదని పేర్కొంది. ఈ ఏడాదిలోనే ఇలాంటి లోపాల కారణంగా సుమారు 500 ఉత్తర్వులను రద్దు చేసినట్లు వెల్లడించింది.
దాడి కేసులో గచ్చిబౌలి పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రంపై కూకట్‌పల్లి మేజిస్ట్రేట్ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న విధానాన్ని సవాలు చేస్తూ శేరిలింగంపల్లికి చెందిన కోడూరు పిచ్చేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించకుండా, తగిన కారణాలు నమోదు చేయకుండానే ఉత్తర్వులు ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కాగ్నిజెన్స్ దశలో నిందితుడు నేరం చేశాడని నిర్ధారించాల్సిన అవసరం లేదని, ప్రాథమికంగా కేసు ఉందో లేదో పరిశీలించాలని స్పష్టం చేసింది. సమన్లు జారీ చేయడానికి గల కారణాలను ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. మేజిస్ట్రేట్లకు చట్టపరమైన విధానాలపై శిక్షణ ఇవ్వాలని, ఉత్తర్వుల ప్రతులను జిల్లా జడ్జిలు, జ్యుడీషియల్ అకాడమీకి పంపాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
