పదేండ్లుగా కాగితాలపైనే ట్రిపుల్ ఆర్..కేంద్ర కేబినెట్ గడప దాటని ఫైల్

పదేండ్లుగా కాగితాలపైనే ట్రిపుల్ ఆర్..కేంద్ర కేబినెట్ గడప దాటని ఫైల్
  • 2016లోనే సూత్రప్రాయ ఆమోదం 
  • హడ్కో అప్పుతో రూ.526.87 కోట్లు జమ చేసిన రాష్ట్రం
  • 90 శాతం భూసేకరణ అవార్డులు పూర్తి
  • టెండర్లు ముగిసినా ఆమోదం తెలుపని  కేంద్రం
  • అమ్ముకోలేక, అభివృద్ధి చేసుకోలేక రైతుల అవస్థలు

 

హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం ప్రాజెక్టుపై కేంద్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పదేండ్ల కింద, అంటే 2016 నవంబర్‌‌‌‌‌‌‌‌లోనే ఈ రహదారికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దశాబ్దం గడిచినా ఆ ఫైలు ఇంకా కేంద్ర కేబినెట్ గడప దాటలేదు. రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రులు, మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా కేంద్రంలో చలనం రావడం లేదు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల రవాణా ముఖచిత్రాన్ని మార్చే 161.5 కిలోమీటర్ల ఈ ఉత్తర భాగం ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వేను కేంద్రం కాగితాలకే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అప్పు తెచ్చి వాటా జమ చేసినా..

పక్క రాష్ట్రాల్లో వందల కిలోమీటర్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వేలకు నెలల్లోనే అనుమతులు ఇస్తున్న కేంద్రం, రాష్ట్రానికి అత్యంత కీలకమైన ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌పై మాత్రం ఏండ్ల తరబడి వివక్ష చూపిస్తోందనే విమర్శలున్నాయి. ఈ ఫైల్‌‌‌‌‌‌‌‌పై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో, సూత్రప్రాయ ఆమోదం వచ్చిన సంవత్సరం చూసి సీఎంతో పాటు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. భూసేకరణ వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర సర్కార్ వెనకాడలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హడ్కో నుంచి ప్రత్యేకంగా అప్పు తెచ్చి మరీ వందల కోట్ల వాటాను ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐకి జమ చేసింది.

రోడ్డు నిర్మాణ సామగ్రిపై రాయల్టీలు, సీనరేజ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, పన్నుల్లో రాష్ట్ర వాటాను తిరిగి ఇచ్చేందుకు జీవో కూడా జారీ చేసింది. వేలాది హెక్టార్ల భూసేకరణను కొలిక్కి తెచ్చి, నిర్వాసితులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంది. ఆరు లేన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలై, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) పచ్చజెండా ఊపినా కేంద్రం నుంచి మోక్షం లభించడం లేదు. ఉపరితల రవాణా శాఖ కేబినెట్ నోట్ సిద్ధం చేసి పంపినా, కేంద్ర మంత్రివర్గం దాన్ని ఆమోదించకపోవడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు భూసేకరణ పరిధిలోని వేలాది మంది రైతుల భూములు ఏండ్ల తరబడి లాక్ అయిపోవడంతో, అటు అమ్ముకోలేక ఇటు అభివృద్ధి చేసుకోలేక వాళ్లు ఆవేదన చెందుతున్నారు.

కేబినెట్ ఆమోదిస్తేనే పనులు

మార్చిలో గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌తో రహదారి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో 6 లేన్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వే నిర్మాణానికి రెండు ప్యాకేజీలుగా మే 20న టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలు గడువు గత నెల 22న ముగిసింది. కేంద్ర కేబినెట్ ఆమోదిస్తేనే నిధులు వస్తాయని, అవి వస్తేనే పనులు ముందుకు కదులుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడేండ్లలో స్పీడప్

2016లో సూత్రప్రాయ ఆమోదం వచ్చినా గత ప్రభుత్వం ఫాలోఅప్ చేయడంలో వెనకబడిందని, భూసేకరణపై కోర్టు కేసులు, పరిహారం చెల్లింపులో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక, కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా గత మూడేండ్లలో భూసేకరణ, నిధుల చెల్లింపు వేగంగా ముందుకు సాగాయి. ఉత్తర భాగానికి మొత్తం 1,918.5 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటికే రూ.1,292.5 కోట్ల విలువైన 1,729.08 హెక్టార్ల భూసేకరణ అవార్డులను కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ (సీఏఎల్ఏ) అధికారులు ఆమోదించారు. 906.96 హెక్టార్లకు సంబంధించిన రూ.674.51 కోట్ల పరిహారాన్ని ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ సీఏఎల్ఏల దగ్గర జమ చేసింది. భూసేకరణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర వాటా కింద గతంలోనే రూ.100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చిన ప్రభుత్వం, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మరో రూ.526.87 కోట్లు జమ చేయాలని ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ రీజినల్ ఆఫీసర్ ఈ ఏడాది జనవరి చివర్లో లేఖ రాయడంతో వెంటనే స్పందించింది. హడ్కో ద్వారా ప్రత్యేకంగా రుణం తీసుకుని ఆ మొత్తాన్ని గజ్వేల్‌‌‌‌‌‌‌‌లోని ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ (పీఐయూ)కు బదిలీ చేసింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో జీవో 194 జారీ చేసి నిర్మాణ సామగ్రి, మైనర్ మినరల్స్‌‌‌‌‌‌‌‌పై సీనరేజ్, రాయల్టీలను పూర్తిగా రద్దు చేసింది. ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలతో కలిపి 7 ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ ప్రాజెక్టులకు రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది.