హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కాబోతున్నాయి. రాత్రి టెంపరేచర్లు దారుణంగా పతనమయ్యే అవకాశాలున్నాయి. సింగిల్ డిజిట్ లోనే టెంపరేచర్లు నమోదయ్యే చాన్స్ ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. డిసెంబర్ 7 (ఆదివారం) నుంచి 17 వరకు చలి తీవ్రత అధికంగా ఉండనున్నది.
తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలిపంజా విసిరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు హైదరాబాద్ సిటీలోనూ ఆదివారం నుంచి 10 రోజుల పాటు చలి వణికిస్తుందని అధికారులు వివరించారు. దీనిపై ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ కమిషనరేట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు 5 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతాయని చెప్తున్నారు. హైదరాబాద్ సిటీలో (జీహెచ్ఎంసీ పరిధిలో) 5 నుంచి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్నారు. చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్‌లో 5 నుంచి 8 డిగ్రీలు, హెచ్‌సీయూ, శేరిలింగంపల్లి, నానకర్రామ్ గూడ వంటి ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల మధ్యే రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని చెబుతున్నారు.
ఉత్తరాదిలో పెరుగుతున్న చలి
రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో ఇప్పటికే చలి ప్రభావం పెరిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 10.4, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 10.8 డిగ్రీల చొప్పున నైట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 12.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.
ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీ పరిధిలో నైట్ టెంపరేచర్లు 15 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. ఒక్క హెచ్‌సీయూలో మాత్రమే 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఈ నెల మొత్తం రాష్ట్రమంతటా పొడి వాతావరణ పరిస్థితులే ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
బాచుపల్లి పరిసరాల్లో ఘాటు వాసనలు
రాష్ట్రంలో చలి ప్రభావం పెరుగుతుండడంతో ఇండస్ట్రియల్ ఏరియాల్లోని జనాలు పొల్యూషన్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బాచుపల్లి తదితర ప్రాంతాల్లోని ఇండస్ట్రీల నుంచి వచ్చే ఘాటు వాసన.. చలి వాతావరణం కారణంగా నేలకు కొంత ఎత్తులోని గాలిలోనే డిపాజిట్ అయిపోతున్నాయి. దీంతో ఆ ఘాటు వాసనలకు జనం అల్లాడిపోతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతున్నదని అక్కడి ప్రజలు చెప్తున్నారు. సాయంత్రం టెంపరేచర్లు మరింత పడిపోతుండడంతో ఆ ప్రభావం రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటున్నదని అంటున్నారు.
