
వనపర్తి/ గోపాల్పేట, వెలుగు: కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కాల్వలు, రిజర్వాయర్ల భూసేకరణకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆయన అడిషనల్ కలెక్టర్ భీమ్యానాయక్తో కలిసి భూసేకరణ పనులపై అధికారులతో రివ్యూ చేశారు. గోపాల్పేట మండలం జయన్న తిర్మలాపూర్ ప్రాంతానికి చెందిన 12.95 ఎకరాల భూసేకరణ సర్వే పూర్తైనందున మార్కెట్ విలువ నిర్ధారించి అవార్డు పాస్ చేసేలా, సెప్టెంబర్ 15 వరకు ప్రాథమిక నోటీసు ప్రచురించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేవల్లి మండలం కేశంపేట పరిధిలోని 29.94 ఎకరాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. రేమద్దుల పరిధిలోని డీ- 8 భూసేకరణకు మార్కింగ్ ఫిక్స్ చేయాలని ఆదేశించారు. దత్తాయిపల్లి, బుద్ధారం, షాపూర్, మల్కాపూర్ పరిధి భూసేకరణకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. బుద్ధారం పరిధిలోని 109.17 ఎకరాల్లో ఉన్న స్ట్రక్చర్ పేమెంట్ పూర్తి చేయాలని, ఖిల్లాగణపూర్ మండలం గణప సముద్రం ఎఫ్ఆర్ఎల్ కు సంబంధించిన 197.09 ఎకరాలకు సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాంచెరువు, చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడానికి సంబంధించిన భూ సేకరణ రిపోర్టును అటవీ శాఖకు సంబంధించిన పర్వేష్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సిందిగా సూచించారు.
గోపాల్‌పేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..
గోపాల్పేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను కలెక్టర్ ఆదర్శ్సురభి ఆకస్మిక తనిఖీ చేశారు. గతేడాది 10వ తరగతి ఫలితాలను పరిశీలించి, మెరుగైన ఫలితాలకు కృషి చేయాలన్నారు. టెన్త్ తర్వాత టీసీ తీసుకోని విద్యార్థులను గుర్తించి, వారు ఉన్నత విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎంశ్రీ పథకం కింద నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్ పనులను, మ్యూజిక్ బ్యాండ్ పరికరాలను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ కేసులు ఉన్న ప్రాంతాల్లోనూ యాంటీ లార్వా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వైద్యులు ఆస్పత్రిలో నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని సందర్శించి యూరియా పంపిణీపై ఆరా తీశారు. స్టాక్‌కు సంబంధించిన వివరాల బోర్డు పెట్టాలన్నారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు.