మీడియా సెంటర్ ప్రారంభం ; ప్రశాంత్ జీవన్ పాటిల్

మీడియా సెంటర్ ప్రారంభం ; ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల రోజువారీ జిల్లా సమాచారాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించేందుకు మీడియా సెంటర్ ను ప్రారంభించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆఫీస్ లో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియా సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబుల్, శాటిలైట్ చానళ్లలోవచ్చే ఎన్నికల వార్తలను రికార్డ్ చేయడానికి, ఎన్నికల వార్తలు చూసేందుకు టీవీలను ఏర్పాటు చేశామన్నారు.

మీడియా వారికి ఎన్నికల వివరాలను అందించేందుకు కంప్యూటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.  ఎన్నికల నామినేషన్ సందర్భంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో రోజూ వేసిన నామినేషన్లు, అభ్యర్థుల అఫిడవిట్  వివరాలు అన్ని మీడియా సెంటర్ లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.

ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివిధ పత్రికలు, చానళ్లలో వచ్చే పెయిడ్ న్యూస్ లను పరిశీలించేందుకు, పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లను ముందస్తుగా పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు మీడియా సెంటర్​లో ఎంసీఎంసీ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ, ఎంసీఎంసీ కన్వీనర్ బి.రవికుమార్, కలెక్టరేట్ ఏవో రహమాన్, సమాచార పౌర సంబంధాల శాఖ డీఈ తిరుపతి నాయక్, ఎలక్షన్స్ సూపరింటెండెంట్ రామేశ్వర్, ఎలక్షన్ డీటీ శ్రీనివాస్ పాల్గొన్నారు.