సర్కార్ బడిలో నో బ్యాగ్ డే..నెలలో నాలుగో శనివారం అమలు : కలెక్టర్ అనుదీప్

సర్కార్ బడిలో నో బ్యాగ్ డే..నెలలో నాలుగో శనివారం అమలు : కలెక్టర్ అనుదీప్
  • ఖమ్మం కలెక్టర్ అనుదీప్​ నిర్ణయం

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లాలోని సర్కార్ బడుల్లో ‘ నో బ్యాగ్ డే’ ను అమలు చేస్తూ  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా నాలుగో శనివారం విద్యార్థులకు ఆటపాటలు, వివిధ అంశాలపై చర్చలు, క్విజ్​, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన వంటి యాక్టివిటీస్​మాత్రమే ఉంటాయి. తొలి రోజు విద్యార్థులంతా ఉత్సాహంగా యాక్టివిటీస్​లో పాల్గొన్నారు. కొన్ని స్కూళ్లలో మట్టితో సీడ్ బాల్స్, మరికొన్ని బడుల్లో  మట్టి గణపతి విగ్రహాల తయారీ, చెట్ల ఆకులతో వివిధ రకాల పక్షులను తయారు చేయడం, పేపర్లతో వేర్వేరు కళాకృతులు చేయడం వంటివి నేర్పించారు. 

కూరగాయల మార్కెట్ల సందర్శన, సర్వే, బుక్ ఫేర్ నిర్వహణ వంటి యాక్టివిటీస్ చేయించారు. ఖమ్మం ఇందిరానగర్​ స్కూల్ లో నో బ్యాగ్ డే అమలు  తీరుపై  కలెక్టర్ అనుదీప్​పరిశీలించారు. చెట్ల ఆకులు, పేపర్లతో యాక్టివిటీ చేస్తున్న విద్యార్థులతో పాటు టీచర్లతో మాట్లాడి అభినందించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ బ్యాగ్ లెస్ డే రోజున బడుల్లో క్విజ్, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడా పోటీల నిర్వహణ వంటివి అమలు చేస్తున్నామని తెలిపారు.  

విద్యార్థులకు అవగాహన, అనుభవం కల్పించేలా కార్యక్రమాల అమలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.  తరగతి గది బోధనకు బదులుగా ఆచరణాత్మక, ఇంటరాక్టివ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని టీచర్లకు సూచించారు.