
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
కారుణ్య నియామకాలు చేపట్టేందుకు జిల్లా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, కార్యాలయ సబార్డినేట్ ఖాళీ పోస్టుల వివరాలను వారం రోజుల్లో పంపాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్ లేని పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని చెప్పారు. జిల్లా అధికారులు ప్రతి వారం తప్పనిసరిగా సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.