
ఖమ్మం టౌన్, వెలుగు : సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పని చేసే ప్రతి ఒక్క అధికారి, ప్రభుత్వ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల భోజనశాల గదిలో తాగునీరు సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.
ప్రతీ ఫైల్ పకడ్బందీగా రికార్డు చేసి పెట్టాలన్నారు. జిల్లాలోని ఒక మండలాన్ని పైలట్ గా తీసుకొని 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇటుక బట్టిల్లో పని చేసే వారి పిల్లలకు తప్పనిసరిగా విద్య అందేలా చూడాలన్నారు. ప్రతి శాఖలో సిబ్బంది ఔట్ సోర్సింగ్, డిప్యూటేషన్ అధికారుల హాజరు కూడా బయో మెట్రిక్ ద్వారా తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట డీఆర్వో ఏ.పద్మశ్రీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి కే. శ్రీనివాస రావు పాల్గొన్నారు.
పచ్చదనం పెంచాలి
జిల్లాలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ విషయమై స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. వన మహోత్సవం కింద అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ లపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఆగస్టు మొదటి వారం నాటికి బ్లాక్ ప్లాంటేషన్, రోడ్ల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని చెప్పారు. డెంగ్యూ కేసు నమోదైన పరిసర ప్రాంతాల్లో ఫీవర్ సర్వే చేయాలని సూచించారు. డిసెంబర్ చివరి నాటికి ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్ కింద ఎత్తైన మొక్కలు నాటాలని సూచించారు.
ప్రతీ మండలంలో అవెన్యూ ప్లాంటేషన్ కింద ఎన్ని మొక్కలు నాటుతున్నారు, ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఇంకా ఎన్ని ఎత్తైన మొక్కలు కావాలో ఎంపీడీవోలు రెండు రోజుల్లో రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యే డెంగ్యూ, మలేరియా కేసుల సమాచారం కూడా స్థానిక సంస్థలకు రోజూ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాల పెండింగ్ ఆస్తి పన్ను వసూలు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, డీఎంహెచ్ వో డాక్టర్ కళావతి బాయి, మున్సిపల్ కమిషనర్లు
పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ సౌకర్యం
ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ సౌకర్యం యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు, డ్రిప్ సౌకర్యం ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,472 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, 2,522 ఎకరాలలో మొక్కలు నాటితే 931 ఎకరాలలో మాత్రమే డ్రిప్ ఏర్పాటు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, వారం రోజుల్లో పురోగతి కనిపించకపోతే వేరే కంపెనీలకు అవకాశం కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆగస్టు 15 నాటికి జిల్లాకు లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంవీ మధుసూదన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, హార్టికల్చర్ అధికారిణి అనిత, ఏడీఏలు పాల్గొన్నారు.