- సీతారామ ఎత్తిపోతల పథకంలో భూసేకరణపై రైతులతో
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమావేశం
ఖమ్మం టౌన్, వెలుగు: సీతారామ ఎత్తిపోతల పథకం సంబంధించి భూ సేకరణకు నిబంధనల మేరకు అత్యధిక పరిహారం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హల్ లో మంగళవారం సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయలపల్లి గ్రామాల్లో భూసేకరణ పరిహారం అంశంపై సంబంధిత రైతులతో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి గ్రామాల్లో సీతా రామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ నిర్మాణంలో భాగంగా భూ సేకరణ చేయాల్సి ఉండగా, భూ సర్వే నిర్వహించి అవార్డులు ప్రకటించామని, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించామన్నారు. బాజుమల్లాయి గూడెం గ్రామంలో ఎకరానికి రూ. 2 . 70 లక్షలు ఉందని, భూ సేకరణ చట్టం ప్రకారం రెండింతలు రూ.5.40 లక్షలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.10.80 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఆర్బిట్రేషన్‌లో 12 శాతం వడ్డీ కింద రూ. 64 వేలు కలిపి మొత్తం రూ.11.44 లక్షలు ఎకరాకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. రేలకాయపల్లి గ్రామంలో ఎకరానికి రూ. 2 . 92 లక్షలు ఉందని, భూ సేకరణ చట్టం ప్రకారం 5 లక్షల 85 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పెంచి 11 లక్షల 70 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ఆర్బిట్రేషన్ లో 12 శాతం వడ్డీ కింద 70,390 రూపాయలు కలిపి మొత్తం 12 లక్షల 40 వేల 390 రూపాయలు ఎకరాకు చెల్లించనున్నట్లు చెప్పారు. కాగా పరిహారం ఇంకా పెంచాలని రైతులు కోరారు.
సుబాబుల్ పంట జీవిత కాలం పరిగణలోకి తీసుకోవాలి: రైతులు
సమావేశంలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ.. తమ భూముల్లో సుబాబుల్ పంట వేశామని, పంట చేతికి వచ్చే సమయానికి, భూములను కోల్పోవడం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. సుబాబుల్ పంట జీవితకాలాన్ని పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా పరిహారం ఇవ్వాలన్నారు. భూమిలో ఉన్న పైప్ లైన్, చెట్లు, ఇతర పరికరాలు, డ్రిప్ సిస్టం వివరాలు సరిగ్గా నమోదు చేసి పరిహారం అందించాలని అన్నారు.
అందరికి ఒకేసారి పరిహారం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిలో ఉన్న వ్యవసాయ పంపు సెట్ల, చెట్లు, సుబాబుల్ చెట్లు, ఇతర నిర్మాణాలకు సెపరేట్ గా పరిహారం అందిస్తామని కలెక్టర్ అన్నారు. గరిష్ట పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తామని భూ నిర్వాసితులు, భూ సేకరణకు సహకరించాలన్నారు. ప్రభుత్వం నుండి పరిహారం త్వరితగతిన అందేలా చూస్తానన్నారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ భూ సేకరణ అధికారులు, నిర్వాసిత రైతులు తదితరులుపాల్గొన్నారు.
