కామారెడ్డిటౌన్, వెలుగు : విద్యార్థుల అభివృద్ధికి అధికారులు, టీచర్లు శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర ఆశ్రమ స్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యా బోధన, స్టోర్ రూమ్, వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కొద్ది సేపు వాలీబాల్ ఆడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి సతీశ్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు.
డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలి..
జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డు పక్కన ఎస్టీ బాలుర హాస్టల్ సమీపంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు.
జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ
కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
