శిఖం భూముల సర్వేలో జాప్యంపై కలెక్టర్​ గౌతమ్​ ఆగ్రహం

శిఖం భూముల సర్వేలో జాప్యంపై కలెక్టర్​ గౌతమ్​ ఆగ్రహం

కారేపల్లి, వెలుగు: కారేపల్లి పెద్ద చెరువు శిఖం భూముల సర్వేలో జాప్యంపై కలెక్టర్​ గౌతమ్​ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కారేపల్లి, పేరుపల్లి, మాదారం గ్రామాల్లో గురువారం కలెక్టర్​ పర్యటించారు. కారేపల్లి వచ్చిన కలెక్టర్​ను మత్స్యకారులు కలసి చెరువు శిఖం భూముల సమస్యను వివరించడంతో కలెక్టర్​ చెరువును పరిశీలించి తహసీల్దార్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. తులిశ్యాతండా గ్రామస్తులు కలెక్టర్​ కారును ఆపి తమ సమస్యలను వివరించారు. అనంతరం వివిధ పాఠశాలలను సందర్శించి మనఊరు– మనబడి పనులను పరిశీలించారు. మొక్కలు నాటాలని మాదారం డోలమైట్​ మైన్స్​ అధికారులకు సూచించారు. డీఆర్డీవో ​విద్యాచందన, ఎంపీపీ మాలోత్​ శకుంతల, తహసీల్దార్​ రవికుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్​ పాల్గొన్నారు.

88 మంది స్టూడెంట్స్​కు 9 మంది టీచర్లా? 

కారేపల్లి: తొమ్మిది మంది టీచర్లు ఉన్న పాఠశాలలో 88 మంది విద్యార్థులే ఉండటం ఏమిటని స్కూల్​ టీచర్ల పనితీరుపై కలెక్టర్​ వీపీ గౌతమ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని పేరుపల్లి జడ్పీ​హైస్కూల్లో మనఊరు మనబడి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇంగ్లిష్​ మీడియంపై అవగాహన కల్పించడంలో టీచర్లు విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో పేరెంట్స్​ ప్రైవేట్​ స్కూళ్లకు తమ పిల్లలను పంపిస్తున్నారని అన్నారు. పేరెంట్స్​కు అవగాహన కల్పించి స్టూడెంట్స్​ సంఖ్య పెంచాలని సూచించారు.  

పీహెచ్ సీల్లో డెలివరీలు పెంచాలి

జిల్లాలోని పీహెచ్​సీల్లో డెలివరీలు పెంచేలా చూడాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టర్ ఛాంబర్ లో గురువారం ఈ నెలలో ఎక్కువ డెలివరీలు చేసిన వైద్యాధికారులను శాలువాతో సత్కరించి, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు. ఎంవీ పాలెం వైద్యాధికారి డా. జి. శ్రీదేవి, పరిగలపాడు వైద్యాధికారి డా.జి. రాజు 11 డెలివరీల చొప్పున, తల్లాడ వైద్యాధికారి డా. సీహెచ్. జ్యోతి 13 డెలివరీలు చేయడం అభినందనీయమన్నారు. పీహెచ్​సీ వైద్యాధికారులతో పాటు పల్లె దవాఖానాల డాక్టర్స్ కు ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. కావాల్సిన సదుపాయాలు, పరికరాల కోసం ప్రపోజల్స్​ పంపించాలని చెప్పారు. డీఎంహెచ్​వో డాక్టర్. బి. మాలతి, డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్.రాంబాబు, పీవో ఎంసీహెచ్ డాక్టర్ సైదులు, ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్. నిలోహన పాల్గొన్నారు.