సిటీ లైబ్రరీలో విలువైన పుస్తకాలు ఉంచాలి .. కలెక్టర్ హరిచందన ఆదేశం

సిటీ  లైబ్రరీలో విలువైన పుస్తకాలు ఉంచాలి .. కలెక్టర్ హరిచందన ఆదేశం
  • వాలంటీర్లను నియమించుకోవాలి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ సెంట్రల్ లైబ్రరీలో అన్ని రకాల విలువైన పుస్తకాలు, న్యూస్ పేపర్లను రీడర్ల కోసం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీని ఆమె సందర్శించారు. చిల్డ్రన్స్​ విభాగం, మహిళా విభాగం, జ్ఞాన జ్యోతి రీడింగ్ హాల్ (అంధుల), పాఠ్యపుస్తకాలు, న్యూస్ పేపర్ల విభాగాలతోపాటు సమావేశపు హాల్​ను పరిశీలించారు. లైబ్రరీకి వచ్చే రీడర్స్ సంఖ్య ఎక్కువగా ఉన్నందున వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని, పలు విభాగాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. 

వాలంటీర్లకు ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. ఉన్నత విద్య, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, లైబ్రరీలో నిరంతరం విద్యుత్ తో పాటు  తాగునీరు ఉండేలా చూడాలని సూచించారు. అలాగే నగరంలో ఉన్న లైబ్రరీలకు ఏం కావాలనే రిపోర్టు తనకు ఇవ్వాలని ఆదేశించారు. సాయంత్రంలోపు 82 లైబ్రరీలకు సంబంధించి రిపోర్టును కలెక్టర్ కు లైబ్రరీ అధికారులు అందజేశారు. బ్రాంచ్ లైబ్రరీల్లో ఫెసిలిటీస్ తో పాటు కొత్త భవనాలు కొన్ని,  ఇంకొన్నింటి రిపేర్లు కావాలని కోరారు. అదనపు కలెక్టర్ కదిరవన్ పలని,  లైబ్రరీ సెక్రటరీ పద్మజ, తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ ఉన్నారు.

యూపీహెచ్ సీల నిర్మాణం త్వరగా చేపట్టండి

హైదరాబాద్ జిల్లాలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్​సీ) నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు, టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హరిచందన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంటోన్మెంట్ డిప్యూటీ సీఈవో పల్లవి, జిల్లా వైద్యాధికారులు, బల్దియా ఇంజినీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఖైరతాబాద్​లో 6, చార్మినార్​లో 4, కంటోన్మెంట్​లో 4 యూపీహెచ్​సీలను 200 చదరపు గజాల చొప్పున నిర్మించాల్సి ఉందన్నారు. తహసీల్దార్లు, ఇంజినీర్లు కలిసి స్థలాలను గుర్తించి వారంలోపు టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.