- కలెక్టర్ జితేష్ వి.పాటిల్
జూలూరుపాడు, వెలుగు : ఇంట్లో ఆడ పిల్లలు చదివితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలోని వంటశాల, డార్మెటరీ, బాత్రూమ్స్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదుల్లో డిజిటల్క్లాస్లను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఖాళీ స్థలాల్లో ప్లాంటేషన్ చేయించాలని, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేయాలని, రాత్రి పూట వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
అందుకు అవసరమైన బడ్జెట్ అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో అజయ్, ఎంపీవో తులసీరాం తదితరులు ఉన్నారు.
