జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాటారం నుంచి మహాముత్తారం వరకు, భూపాలపల్లి నుంచి గొల్లబుద్దారం వరకు ఉన్న ఆర్అండ్ బీ రహదారుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రోడ్డు వెడల్పు, సైన్‌బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం కమలాపూర్‌లో జరుగనున్న మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పారిశుధ్యం, పార్కింగ్ సౌకర్యాలు సమృద్ధిగా కల్పించాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రవాణా నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
