ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి : కలెక్టర్​ రాజర్షి షా

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి : కలెక్టర్​ రాజర్షి షా

పాపన్నపేట, వెలుగు : ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్  రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపల్లి, యూసుఫ్ పేట ఉన్నత పాఠశాల మైదానంలో ప్రజలకు ఓటు హక్కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటరు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.  ఓటు అనే ఆయుధం రాజ్యాంగ కల్పించిన హక్కు అని దానిని డబ్బు, మద్యం కోసం అమ్ముకోవద్దన్నారు. కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారి రాజిరెడ్డి, డీఎస్పీ ఫణిందర్, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు పాల్గొన్నారు

ర్యాండమైజేషన్​ తర్వాత సామగ్రి భద్రపర్చాలి

మెదక్ టౌన్ :  కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్ పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్​లలో భద్రపర్చాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలోని  రెండు నియోజక వర్గాల్లో 4,34,900 మంది ఓటర్లున్నారని, 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు  సంబంధించి కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు 25 శాతం, వీవీ ప్యాట్​లు 40 శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రెండో దఫాలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్  సిబ్బంది ర్యాండమైజేషన్ జరుగుతుందని,  మూడో ర్యాండమైజేషన్ లో కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు  ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించుటకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.  పోలింగ్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని పార్టీల  ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో  ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, సయ్యద్ ఇష్రత్, గౌస్ ఖురేషి, అంజనేయులు, నర్సింలు, బస్వరాజు, అఫ్జల్​ పాల్గొన్నారు. 

డీఆర్​సీ సెంటర్​ పరిశీలన 

పట్టణంలోని డీఆర్​సీ సెంటర్‌‌లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్​ను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, ఈవీఎంలను  భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్​లను పరిశీలించారు.  ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.