విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ; రాజర్షిషా

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ; రాజర్షిషా

పాపన్నపేట, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శనివారం మండలంలోని  మల్లంపేట పోలింగ్ బూత్​లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్​ లిస్టులో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఈ నెల 30 చివరి తేది అన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూతుకు రాలేనివారు పోస్టల్ బ్యాలెట్లు పొంద వచ్చన్నారు. మండలంలోని మొత్తం పోలింగ్ బూత్​లను సిబ్బందితో కలసి పరిశీలించాలని తహసీల్దార్​లక్ష్మణ్ బాబును ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, మల్లంపేట సర్పంచ్ బాపురెడ్డి ఉన్నారు.

సూపర్​వైజర్​ సస్పెన్షన్

పాపన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్, ఎన్నికల సూపర్​వైజర్​ రాధా కృష్ణను వెంటనే సస్పెండ్​ చేయాలని ఆర్డీవో ను ఆదేశించారు.  గ్రామంలో చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో తొలగించనందుకు, బీఎల్డీలను సమన్వయం చేయడంలో విఫలమైనందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​ తెలిపారు.