కలెక్టరేట్లు నడుస్తలెవ్.. కరోనా బారిన ఆఫీసర్లు, స్టాఫ్

కలెక్టరేట్లు నడుస్తలెవ్.. కరోనా బారిన ఆఫీసర్లు, స్టాఫ్
  • అరకొర సిబ్బందితో ఖాళీగా కనిపిస్తున్న ఆఫీసులు
  • నామమాత్రంగా నడుస్తున్న వివిధ డిపార్ట్​మెంట్లు
  • గ్రీవెన్స్ బంద్.. కలెక్టరేట్ల ముందు కంప్లెయింట్స్​ బాక్సులు
  • టెలీ, వీడియో కాన్ఫరెన్స్​ల ద్వారా రివ్యూలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు కరోనా బారిన పడడంతో కలెక్టరేట్లు సహా వివిధ గవర్నమెంట్​ ఆఫీసులు మూతపడుతున్నాయి. ప్రతి జిల్లాలో వందలాది స్టాఫ్​ కరోనా సోకి, హోం ఐసోలేషన్​కు పరిమితం కావడంతో ఏ డిపార్ట్​మెంట్​లో చూసినా ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. అన్నిచోట్ల గ్రీవెన్స్​సెల్​ రద్దు చేసిన ఆఫీసర్లు.. అర్జీలు తీసుకునేందుకు కలెక్టరేట్ల ముందు కంప్లెయింట్స్​ బాక్సులు ఏర్పాటు చేశారు. కరీంనగర్, మెదక్​తో పాటు పలు జిల్లాల్లో కలెక్టరేట్ల మెయిన్​ గేట్లు మూసేసి పబ్లిక్​ను లోపలికి రానివ్వట్లేదు. కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్​ల ద్వారా కరోనా, వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన రివ్యూలు చేస్తున్నారు.

కరోనా హాట్​స్పాట్లుగా కలెక్టరేట్లు..

జిల్లాల్లోని కలెక్టరేట్లు కరోనా హాట్​స్పాట్లుగా మారాయి. వందల మంది ఆఫీసర్లు, స్టాఫ్​ కరోనా బారినపడ్డారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో 36 డిపార్ట్​మెంట్లు ఉండగా, సెకండ్​వేవ్​లో 350 మందికి కరోనా సోకడంతో ఐసోలేట్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో 98 మందికి, కరీంనగర్​ కలెక్టరేట్​లో 25 మందికి, యాదాద్రి జిల్లా కలెక్టరేట్​లో 30 మందికి, కామారెడ్డి కలెక్టరేట్​లో 40 మందికి కరోనా సోకడంతో  ఏ డిపార్ట్​మెంట్​లో చూసినా ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా కోవిడ్​బారినపడి, నిమ్స్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్​ శృతి ఓజా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి కి పాజిటివ్​ రావడంతో హోం ఐసోలేషన్​లో ఉండి రివ్యూ చేస్తున్నారు. అన్ని కలెక్టరేట్లలో గ్రీవెన్స్ రద్దు చేశారు. ఎంట్రన్స్ ల దగ్గర బాక్స్ లు పెట్టి పిటిషన్లు తీసుకుంటున్నారు. 

జిల్లాల్లో ఇలా.. 

  • కామారెడ్డి జిల్లాలో హెల్త్, రెవెన్యూ, పోలీస్ సహా వివిధ విభాగాల్లో 350 మంది దాకా ఆఫీసర్లు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.
  • జనగామ జిల్లాలోని వివిధ డిపార్ట్​మెంట్లలో 200 కు పైగా స్టాఫ్​, ఆఫీసర్లు కరోనా బారిన పడ్డారు. 3 రోజుల కింద జనగామ పీఆర్ డీఈ కృష్ణ కరోనాతో చనిపోయారు. జనగామ సబ్ రిజస్ట్రార్ ఆఫీస్ లో ఇద్దరు ఎంప్లాయీస్​కు కరోనా రావడంతో గురు, శుక్రవారాలు ఆఫీస్ క్లోజ్ చేశారు. 
  • మహబూబాబాద్​ జిల్లాలోని ప్రభుత్వ శాఖలకు చెందిన 250 మందికి పైగా కరోనా బారిన పడటంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. 
  • సూర్యాపేట జిల్లా రెవెన్యూశాఖలో 32 మందికి, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో121 మందికి, పోలీస్ శాఖలో 62, వ్యవసాయ శాఖలో 48 మందికి కరోనా సోకింది. పోలీస్ శాఖలో ముగ్గురు, డీఆర్డీఏ లో ఇద్దరు చనిపోయారు. జిల్లా పౌర సమాచార శాఖలో నలుగురు ఉద్యోగులు ఉండగా వారిలో ముగ్గురికి కరోనా రావడంతో ఒక్క ఉద్యోగి మాత్రమే డ్యూటీకి అటెండ్ అవుతున్నారు.
  • కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డీపీఓ శ్రీకాంత్, డీఆర్​డీఏ ఇన్​చార్జి పీడీ రవికృష్ణ కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పని చేస్తున్న  సుమారు 50 మంది కరోనా బారిన పడ్డారు. 
  • మంచిర్యాల జిల్లాలోని వివిధ డిపార్ట్ మెంట్లలో 250 మంది ఎంప్లాయీస్ కరోనా బారినపడ్డారు. పది మంది దాకా చనిపోయారు. 
  • వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషాతో పాటు తహసీల్దార్, ముగ్గురు ఉద్యోగులు కరోనా బారినపడడంతో కలెక్టరేట్ స్టాఫ్​ అంతా  క్వారంటైన్ లోకి వెళ్లారు. వనపర్తి ఆర్డీవో కార్యాలయం లోనూ సేవలు నిలిచిపోయాయి. 
  • నారాయణపేట  కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలో వందలాది స్టాఫ్​కు కరోనా సోకింది.  కలెక్టర్ సీసీ కూడా కోవిడ్​తో చనిపోయారు.  జిల్లాలో దాదాపు 80 మంది దాకా గవర్నమెంట్​ స్టాఫ్​  కరోనా బారిన పడ్డారు. 
  • నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన 98 మందికి పాజిటివ్ వచ్చింది.  జడ్పీ,  డీఈఓ, డీఆర్డీఏ, ఇతర ఆఫీసుల్లో పనిచేసే సుమారు 20 శాతం మంది స్టాఫ్​ కరోనాతో క్వారంటైన్​ అయ్యారు. 
  • జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో పనిచేసే దాదాపు 15 మందికి కరోనా పాజిటివ్ రావడంతో  గ్రీవెన్స్​రద్దు చేశారు. పోలీస్ శాఖలో 35 మందికి కరోనా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
  • మెదక్  కలెక్టరేట్ సహా హెల్త్, పోలీస్ డిపార్ట్​మెంట్లలో సుమారు 50 మంది ఎంప్లాయీస్ కరోనా బారినపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్​ విజయ్ కుమార్ ఇటీవల కోవిడ్​తో చనిపోయారు.  కలెక్టరేట్​ వద్దకు ఎవరైనా వస్తే కోవిడ్ టెస్ట్​ చేసి,​ నెగిటివ్ ఉంటేనే లోపలికి పంపుతున్నారు. 
  • సిద్దిపేట జిల్లాలోని వివిధ డిపార్ట్​మెంట్లలో పనిచేస్తున్న 70 మందికి పైగా ఉద్యోగులు  కరోనా బారినపడి క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో చాలా వర్క్స్​ పెండింగ్​లో పడుతున్నాయి. ఒక్క పోలీస్​ శాఖలోనే సుమారు 20 మంది కరోనా బారినపడ్డారు.