FIFA World Cup: కొలంబియా కేక.. గత అనుభవాలను తుడిచి పెడుతూ థ్రిల్లింగ్ స్టార్ట్

FIFA World Cup: కొలంబియా కేక.. గత అనుభవాలను తుడిచి పెడుతూ థ్రిల్లింగ్ స్టార్ట్

మెక్సికో సిటీ: గత వరల్డ్‌‌ కప్‌‌కు అర్హత సాధించలేకపోయిన కొలంబియా జట్టు ఈసారి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. గ్రూప్‌‌–కే లీగ్‌‌ మ్యాచ్‌‌లో కొలంబియా 3–1 తేడాతో ఉజ్బెకిస్తాన్‌‌పై నెగ్గింది. స్టార్‌‌ ప్లేయర్‌‌ లుయిస్‌‌ డియాజ్‌‌ (65వ ని) ఒక గోల్‌‌ చేయడంతో పాటు సహచర ఆటగాడు గోల్‌‌ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

డేనియల్‌‌ మునోజ్‌‌ (40వ ని), జెమింటన్‌‌ కాంపాజ్‌‌ (90+9వ ని) చెరో గోల్‌‌ చేశారు. ఫైజుల్లావ్‌‌ అబ్బోస్‌‌బెక్‌‌ (60వ ని) ఉజ్బెక్ తరఫున ఏకైక గోల్‌‌ చేశాడు. వరల్డ్‌‌ కప్‌‌లో తొలిసారి బరిలోకి దిగిన డియాజ్‌‌ ఆరంభం నుంచే మెరుపులు మెరిపించాడు. ఉజ్బెకిస్తాన్‌‌ రక్షణ శ్రేణిని ఛేదించి ఒత్తిడిలోకి నెట్టాడు. షార్ట్‌‌ పాస్‌‌లతో బంతిని ఎక్కువసేపు ఆధీనంలో ఉంచుకుని గోల్స్‌‌ చేసే అవకాశాలను సృష్టించాడు.

దాంతో లెఫ్ట్‌‌ వింగ్‌‌ నుంచి డియాజ్‌‌ ఇచ్చిన పాస్‌‌ను నేర్పుగా గోల్‌‌ పోస్ట్‌‌లోకి పంపిన మునోజ్‌‌ కొలంబియాను 1–0 ఆధిక్యంలో నిలిపాడు. సెకండాఫ్‌‌లో అబ్బోస్‌‌బెక్‌‌ గోల్‌‌ కొట్టడంతో ఇరుజట్ల స్కోరు 1–1తో సమమైంది. ఆ వెంటనే కొలంబియా వరుస విరామాల్లో మరో రెండు గోల్స్‌‌ చేసి విజయాన్ని సాధించింది. ఇదే గ్రూప్‌‌లో పోర్చుగల్‌‌, కాంగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌‌ 1–1తో డ్రా అయ్యింది. దాంతో ఈ గ్రూప్‌‌లో కొలంబియా టాప్‌‌ ప్లేస్‌‌కు చేరుకుంది.