ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రైతులను మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్​ ధర్నాలు

మంచిర్యాల/లక్ష్మణచాంద, వెలుగు: రుణమాఫీతో పాటు ఇతర సమస్యలపై రైతులు ఉద్యమించకుండా మభ్యపెట్టడానికే బీఆర్ఎస్  లీడర్లు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. పార్టీ జిల్లా ఆఫీసులో శనివారం ప్రెస్​మీట్​లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను దారిమళ్లిస్తే.. ఆ నిధులను తిరిగివ్వాలని కేంద్రం కోరడం రైతు రైతు వ్యతిరేకమెట్లవుతుందన్నారు. ఉపాధి నిధులతో ఎన్ని కల్లాలు నిర్మించారో వైట్​పేపర్​పై రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లీడర్లు రజినీష్ జైన్, పెద్దపెల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, వంగపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

మంత్రులు ధర్నా చేయడం సిగ్గు చేటు..

రైతుల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్​మంత్రులు, ఎమ్మెల్యేలు  ధర్నాలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పెద్దపెల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్ విమర్శించారు. లక్ష్మణ చాందలో మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్​కు లేదన్నారు.  రామగుండం ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రారంభించేందుకు ప్రధాని మోడీ  రామగుండం వస్తే, సీఎం కేసీఆర్​పారిపోయి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల వారీగా రైతుల్ని  చైతన్యం చేయాలని రామనాథ్ పిలుపునిచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేకు కమీషన్లపైనే శ్రద్ధ:  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఎమ్మెల్యే జోగు రామన్నకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​ విమర్శించారు. శనివారం  జిల్లా కేంద్రంలోని గణేశ్​థియేటర్ స్థలాన్ని పార్కింగ్ గా మార్చాలని డిమాండ్​ చేస్తూ  బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్​మాట్లాడుతూ థియేటర్​ కూల్చిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్​చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ నేతాజీ చౌక్ వంటి ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్​సమస్యను పరిష్కరించకుండా మున్సిపల్​ఆఫీసర్లు కమీషన్లకు ఆశపడుతున్నారన్నారు. నెల రోజుల్లో థియేటర్​స్థలాన్ని పార్కింగ్​ స్థలంగా మార్చాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్ని హెచ్చరించారు. బీజేపీ లీడర్లు వేణు గోపాల్, ఆదినాథ్​,  మున్నా, రవి తదితరులు
 పాల్గొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు వీఆర్ఎస్​ తప్పదు


ఆసిఫాబాద్, వెలుగు :  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు వీఆర్ఎస్​తప్పదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. శనివారం గోలేటిలో మీడియాతో మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి టీబీజీకేఎస్ లీడర్లు రాజకీయ సభగా చేసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించమని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పినా విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడం,  కూతురు కవిత లిక్కర్​స్కాంలో ఇరుక్కోవడంతో ఆందోళన చెందుతున్న కేసీఆర్ దుష్ప్రచారానికి తెరలేపారన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నవీన్ గౌడ్, గోలేటి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేశ్​తదితరులు పాల్గొన్నారు.

పర్మిషన్​ లేకుండా వెంచర్లు చేయొద్దు


బెల్లంపల్లి, వెలుగు: పర్మషన్లు లేకుండా వెంచర్లు చేస్తే  కఠిన చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ బి. రాహుల్, జేసీ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు.  బెల్లంపల్లి మండలంలోని కన్నాల  పంచాయతీలో ఏర్పాటు చేసిన తిరుమల హిల్స్ వెంచర్ కు డీటీసీపీ పర్మిషన్​లేదని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్​భారతీ హోళికేరి పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అడిషనల్ కలెక్టర్, జేసీ వెంచర్​పర్మిషన్​పై  మండల అధికారులతో ఆరా తీశారు. పర్మిషన్​తీసుకోలేదని చెప్పడంతో వెంచర్​లో బీటీ రోడ్లను తొలగించాలని రెవెన్యూ, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. వారు ట్రాక్టర్​తో రోడ్లను తొలగించారు.  వెంచర్​కు పర్మిషన్​వచ్చేవరకు ఇళ్లు నిర్మించకుండా చూడాలాని అడిషనల్​కలెక్టర్​మండల అధికారులను ఆదేశించారు.  బెల్లంపల్లి  పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ వెనుకాల గల ప్రభుత్వ భూమి 170 పీపీలో అక్రమార్కులు వేసిన ఫెన్సింగ్​పోల్స్​ను కూడా  రెవెన్యూ సిబ్బంది శనివారం  ధ్వంసం చేశారు. తాండూర్ మండలంలోనూ డీటీసీపీ పర్మిషన్​ లేకుండా  ఏర్పాటు చేసిన లేఔట్లను తొలగించారు.