ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

  ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హనుమకొండ, వెలుగు: హరియాణా గవర్నర్​ బండారు దత్తాత్రేయ గురువారం హనుమకొండకు రానున్నారు.  ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి సంస్మరణ సభకు హజరవుతారు. ఉదయం 10.30  గంటలకు హైదరాబాద్​ నుంచి  ఎక్సైజ్​ కాలనీలోని మందాడి సత్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. 11 గంటలకు భీమారంలోని పొద్దుటూరి గార్డెన్స్​లో నిర్వహించనున్న  సంస్మరణ సభలో  పాల్గొననున్నారు. 12.15 గంటలకు తిరిగి హైదరాబాద్​ వెళ్తారు.   

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ రఘుచందర్ 

రఘునాథపల్లి ,వెలుగు : సైబర్ నేరాల పై అందరూ అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘన్​పూర్​ ఏసీపీ రఘుచందర్ అన్నారు. శనివారం మండలంలోని గబ్బెటలో సైబర్ నేరాల పట్ల పోలీసు లు అవగహన సదస్సు ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో ఏసీపీ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ  సైబర్ నేరాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. బ్యాంక్​ వివరాలను ఫోన్లో ఎవరికీ చెప్పొద్దని, ఓటీపీలను షేర్​ చేయొద్దని సూచించారు.  కార్యక్రమంలో జనగామ  సీఐ సంతోష్​​ కుమార్ , లింగాల ఘనాపూర్, చిల్పూర్ ఎస్ఐ లు వీరేందర్, ప్రవీణ్, వినణ్ కుమార్, గబ్బెట్ట సర్పంచ్ జిట్టబోయిన రాజు పాల్గొన్నారు. 

రేషన్​ షాపు  తనిఖీ

జనగామ అర్బన్​, వెలుగు :  పట్టణంలోని గుండ్లగడ్డ రేషన్​ షాపును కలెక్టర్​ శివలింగయ్య బుధవారం తనిఖీ చేశారు.   రేషన్​ షాపును నడిపిస్తున్న తీరును, సరుకులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..     బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని, బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు తప్పవని చెప్పారు. బయోమెట్రిక్​ , ఐరిష్​, మాస్టర్స్​ స్టాకు వివరాలు సంబంధిత డీలరును అడిగితెలుసుకున్నారు.   తనిఖీల్లో ఆయనతో పాటు డీఎస్​వో రోజారాణి, డీఎం సంధ్యారాణి, డీలర్ అబ్బాస్​ తదితరులు పాల్గొన్నారు. 

సందడిగా ఇండక్షన్  ప్రోగ్రామ్

కాజీపేట, వెలుగు :   వరంగల్ నిట్​లో  ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్లకు   ఏర్పాటు చేసిన ఇండక్షన్  ప్రోగ్రామ్​ సందడిగా సాగుతోంది.  దేశంలోని వివిధ ప్రాంతాల  నుంచి క్యాంపస్ కి వచ్చిన మొదటి సంవత్సరం  విద్యార్థులు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు, స్నేహభావాన్ని  పెరిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని  నిట్​ అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి  ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఫొటోగ్రఫీ, చెరియాల్ పెయింటింగ్,    కరాటే, వెస్ర్టన్ అండ్ క్లాసికల్ డ్యాన్స్  ఈవెంట్​లు నిర్వహిస్తున్నారు.  

పల్లె దవాఖాన్లలో సేవలు మంచిగా అందించాలె: కలెక్టర్​ కృష్ణ ఆదిత్య

ములుగు, వెలుగు :  పల్లె దవాఖాన వైద్యులు..  పేద ప్రజలకు   మంచి సేవలు అందించాలని  కలెక్టర్​ ఎస్​. కృష్ణ ఆదిత్య  సూచించారు.  కలెక్టరేట్​లో బీఏఎంఎస్​, ఎంఎల్​హెచ్​పీ, మిడ్​ లెవెల్​ హెల్త్​ ప్రొవైడర్లకు  బ్రిడ్జి కోర్స్​ కమ్యూనిటీ హెల్త్​ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ    డాక్టర్లు  ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.  బ్రిడ్జి కోర్స్​లో వైద్యులు అన్ని అంశాలపై శిక్షణ పొందాలని సూచించారు.  జిల్లా వైద్యాధికారి డాక్టర్​ అల్లెం అప్పయ్య, సూపరింటెండెంట్​ డాక్టర్​ జగదీష్ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్​ విపిన్​, డెమో తిరుపతయ్య, సలిత, హెచ్​ఈ సంపత్​ పాల్గొన్నారు. 

దివ్యాంగులకు ఆటలపోటీలు ..

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  పట్టణంలోని స్టేడియంలో   దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్​ క్రీడలను ప్రారంభించారు.  కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి  ఈపీ ప్రేమలత, జిల్లా యువజన క్రీడల అధికారి పి.వెంకటరమణాచారి, వికలాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి  

మహబూబాబాద్​, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి  ప్రభుత్వం అధిక ప్రాధాం ఇస్తోందని  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు.  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్​టీఆర్​ స్టేడియంలో  ఆటలపోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..   దివ్యాంగులు క్రీడల్లో సైతం  రాణించాలని సూచించారు.  ప్రభుత్వం దివ్యాంగులకు ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తూ ,రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ దివ్యాంగులకు రూ. 3,016 పింఛన్  అందుతోందని చెప్పారు.   కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, సీడబ్ల్యూసీ చైర్మన్​ నాగవాణి, జిల్లా స్పోర్ట్స్​ ఆఫీసర్​ అనిల్​ పాల్గొన్నారు. 

కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలి  

ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ యూసఫ్​

తొర్రూరు, వెలుగు :   మోడీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర  ఏండ్లలో  కార్మికుల హక్కులను హరించాడని, కార్పొరేట్లకు అనువైన చట్టాలు తెస్తున్నారని  ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ యూసప్​ అన్నారు.  ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.  పట్టణంలోని  లయన్స్​ భవనంలో ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలను బుధవారం  నిర్వహించారు.  ఈ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు. అనంతరం  సమావేశంలో  యూసఫ్​ మాట్లాడుతూ..     బీజేపీ ప్రభుత్వం  ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఆదానీ, అంబానీలకు   కట్టబెడుతోందని ఆరోపించారు. కార్మికులు    పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో ముఖ్యమైన 29 చట్టాలను మార్చి దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందనీ, దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.   కార్మికులను  ప్రభుత్వం దోపిడీ చేస్తోందని,  ఇలాంటి ప్రభుత్వాలను కూలదోస్తామన్నారు.  కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి,  సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుల తమ్మెర విశ్వేశ్వరరావు, ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ సారధి, పీఏసీఎస్​ చైర్మన్​ హరిప్రసాద్​ రావు, ఏఐటీయూసీ  వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ పాల్గొన్నారు.  

మట్టి గుట్టలను కాపాడండి : సీపీఎం జిల్లా నాయకుడు  పోదాల నాగరాజు   

రఘునాథపల్లి ,వెలుగు :  మట్టి గుట్టలను కాపాడాలని  సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పోదాల నాగరాజు   కోరారు. మండలంలోని  అశ్వరావు పల్లి , మీదిగోండ గ్రామాల  మధ్య ఉన్న గుట్టలను బుధవారం     సీపీఎం మండల కమిటీ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాగుడూ   గుట్టలను  మైనింగ్ మాఫియా మాయం చేస్తున్నా  మైనింగ్, ఫారెస్టు ఆధికారులు పట్టించుకోవడం లేదన్నారు.  అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి  గంగపురం మహేందర్,  నాయకులు  కాడరి అయిలయ్య ,  అంజనేయులు, నర్సయ్య , గట్టయ్య, లవకుమార్ పాల్గొన్నారు.  

స్టూడెంట్స్​ కోలుకునే వరకూ  మెరుగైన వైద్యం

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి సత్యవతి రాథోడ్​

కొత్తగూడ, వెలుగు: ఫుడ్​పాయిజన్​ తో అస్వస్థతకు గురైన స్టూడెంట్స్​ కోలుకునే వరకూ   వైద్యం అందిస్తామని గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు.    జిల్లా కలెక్టర్​ శశాంక, ఐటీడీఎ పీవో అంకిత్​, జడ్పీ చైర్​పర్సన్​ అంగోతు బిందుతో కలిసి  బుధవారం ఆమె స్కూల్​ను విజిట్​ చేశారు.  అస్వస్థతకు గురైన స్టూడెంట్లతో మాట్లాడారు.  అనంతరం స్టూడెంట్లతో కలసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. స్టూడెంట్లు కొలుకొనే వరకూ హెల్త్​ క్యాంపు కొనసాగించాలని డీఎంహెచ్​ఓ హరీశ్​​రాజ్​ను ఆదేశించారు.  ఆమె వెంట డీఎస్పీ సదయ్య, ట్రైబల్​ వెల్ఫేర్​ డీడీ ఎర్రయ్య, ఓడీసీఎంఎస్​ వైస్​ చైర్​ పర్సన్​ శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీపీ విజయారూప్​సింగ్​పాల్గొన్నారు. 

మానవ హక్కులను కాపాడాలె : వరంగల్​ సీపీ డా.తరుణ్​ జోషి

వరంగల్ క్రైం, వెలుగు:   మానవ హక్కులను పరిరక్షిస్తూ విధులు నిర్వర్తించాలని  సీపీ డా.తరుణ్​ జోషి ఆఫీసర్లకు సూచించారు.  ‘శాంతి భద్రతల సంక్షోభ సమయంలో మానవ హక్కుల పరిరక్షణ’ అనే అంశంపై కమిషనరేట్ లో బుధవారం చర్చా పోటీలను నిర్వహించారు.  ఈ కాంపిటీషన్​కు  సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ  వైభవ్ గైక్వాడ్, సీసీఆర్బీ ఏసీపీ ప్రతాప్ కుమార్ జడ్జీలుగా వ్యవహరించారు.  గెలుపొందిన వారిని  జోనల్ స్థాయి చర్చలకు ఎంపిక చేశారు. చీఫ్​ గెస్ట్​ గా హాజరైన సీపీ తరుణ్​ జోషి మాట్లాడుతూ  మానవ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత  పోలీసులపై ఉందన్నారు.  ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుకుండా ఆఫీసర్లు  తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమిషనరేట్ కు చెందిన 13  డివిజన్లు ఆఫీసర్లు పాల్గొన్నారు.    

ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేయాలి: ఎస్పీ శరత్ చంద్ర పవర్

తొర్రూరు, వెలుగు : ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేయాలని  ఎస్పీ శరత్ చంద్ర పవర్ సిబ్బందికి సూచించారు.  పట్టణ కేంద్రంలోని  పోలీస్ స్టేషన్ ను   బుధవారం ఆయన తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా రోజ్​ గార్డెన్ ను ప్రారంభించి మొక్కను నాటారు. అనంతరం    ఉన్న కేజీవీబీ  విద్యార్థులకు రూ.20 వేల  విలువ చేసే  గీజర్లను అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.  నేరాల నియంత్రణకు  ప్రభుత్వం అత్యధునిక  టెక్నాలజీని వాడుతుందని  , పోలీసులు దానికి అనుగుణంగా పనిచేయాలన్నారు.  స్టేషన్ల పరిధిలో బ్లూ  కోల్ట్స్​ సిబ్బంది అలర్ట్​గా ఉండాలని చెపపారు.  విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.  కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ రఘుబాబు,  సీఐ వై. సత్యనారాయణ, ఎస్సైలు గండ్రాతి సతీశ్, పిల్లల రాజు, రియాజ్, రాంజీ నాయక్, కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారి శైలజ  పాల్గొన్నారు.