ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  •     ఎన్నికలకు సిద్ధం కావాలి
  •     మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి 150మందికి ముగ్గురితో కమిటీలు వేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కుల సంఘాలను తీసుకువస్తే, వాళ్లు ఏం కోరినా ఇస్తానన్నారు. గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్ పంపాలన్నారు. పార్టీ నాయకులు ఇండ్లు లేని వారిని గుర్తిస్తే.. వారికి ఇండ్లు ఇప్పిస్తానన్నారు. మూడు నాలుగు నెలల్లో నిధులు, ఇండ్లు వస్తాయని కార్యకర్తలు హైరానా పడవద్దని సూచించారు. ఈ నెల 15న లేదా 20న సీఎం కేసీఆర్ మహబూబాబాద్ వస్తారని,  సీఎం సభ కోసం పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించాలన్నారు. అనంతరం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.

బోనమెత్తిన మంత్రి..

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా మంత్రి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి బోనమెత్తారు. అనంతరం పెద్దవంగర పీఏసీఎస్​ డైరెక్టర్​అనపురం రవి తల్లి రాజమ్మ ఇటీవల మృతి చెందగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఇస్కాన్​సంస్థకు 10 ఎకరాల భూమి ఇస్తా..

ప్రజల్లో దైవ చింతన పెంపొందించే ఇస్కాన్ సంస్థకు నియోజకవర్గంలోని సన్నూరు గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హామీ ఇచ్చారు. బుధవారం ఇస్కాన్ ఆధ్వర్యంలో పాలకుర్తిలో శ్రీరామ్ విజయోత్సవ యాత్ర నిర్వహించగా చీఫ్ గెస్టుగా మంత్రి హాజరయ్యారు. సోమేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ఇస్కాన్ నిత్యాన్నదానం కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు.

మంత్రితో స్టూడెంట్ల మొర..

స్టేషన్​ఘన్​పూర్: జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం కస్తూర్బా గాంధీ గర్ల్స్ స్కూల్​ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాంపౌండ్ వాల్, ల్యాబ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం భోజనాన్ని పరిశీలించారు.


ఫిజికల్ టెస్టులు పారదర్శకం

  •     ఎవరి మాటలూ నమ్మొద్దు
  •     వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్​

హనుమకొండ, వెలుగు: పోలీస్​ఉద్యోగ నియామకాల్లో ఫిజికల్​ టెస్టులు పూర్తి పారదర్శకంగానే జరుగుతాయని, ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా ఉద్యోగం వచ్చేలా సహాయం చేస్తామని చెప్పేవారి మాటలు నమ్మవద్దని వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్​ సూచించారు. గురువారం నుంచి జనవరి మూడో తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్​లో ఈవెంట్స్​జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మొద్దన్నారు. ఎవరైనా  వ్యక్తులు ఇలాంటి చర్యలకు ఒడిగట్టినట్టుగాగానీ, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందితే వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 94910 89100కు గాని లేదా అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ నంబర్ 94407 95201కు సమాచారం అందించాలని సూచించారు.

అభ్యర్థులు ముందుగా నిర్దేశించిన తేదీల్లోనే ఈవెంట్స్​కు అటెండ్ కావాలని, సమయానికి రాకపోతే అభ్యర్థిత్వం రద్దు అవుతుందన్నారు. అభ్యర్థులకు అందించే రిస్ట్​బ్యాండ్​ ను తొలగించడం గానీ,  డ్యామేజ్ చేయడం గానీ చేస్తే వారిని అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. అభ్యర్థులు మైదానంలో సామాన్లను భద్రపర్చుకోడానికి ఎలాంటి  క్లాక్ రూములు అందుబాటులో ఉండవని,  అత్యవసరమైనవి మినహాయించి ఎలాంటి  వస్తువులు వెంట తీసుకురావద్దన్నారు.

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి

హనుమకొండ, వెలుగు: అర్హులందరికీ ఆఫీసర్లు ఓటు హక్కు కల్పించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల నమోదుకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని స్టేట్​ చీఫ్​ ఎలక్షన్​ ఆఫీసర్​ వికాస్​ రాజ్​ కోరారు. హనుమకొండ కలెక్టరేట్​కాన్ఫరెన్స్ హాల్​లో బుధవారం సాయంత్రం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్టేట్​జాయింట్ సీఈవో రవికిరణ్​, వరంగల్, హనుమకొండ జిల్లాల ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ మాట్లాడుతూ..  నవంబర్ 9 నుంచి  డిసెంబర్ 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,91,063 ఫారం -6 దరఖాస్తులు రాగా 38,860 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు.  ఫారం -7 దరఖాస్తులు 80,461 స్వీకరించి, 13,949 డిస్పోజ్ చేసినట్లు చెప్పారు.

ఇక ఫారం-8 దరఖాస్తులు 57,169 దరఖాస్తులు స్వీకరించి 11,948 దరఖాస్తులు డిస్పోజ్ చేశామని, పెండింగ్ దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2 కోట్ల 96లక్షల 145 ఓటర్లకు గానూ ఒక కోటి 69 లక్షల 80 వేల 171 మంది 6బి ఫారం ఇచ్చి ఆధార్ లింక్ చేసుకున్నారని,  57.37 శాతం ఆధార్ లింక్ దరఖాస్తులలో 75.39 శాతం ఆన్లైన్ ద్వారా, 24.61 ఆఫ్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతి ఓటరు దరఖాస్తుకు ఒక ఫైల్ రూపొందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. బీఎల్వో విధులు  విధులు సక్రమంగా నిర్వర్తించాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డా.గోపి, కమిషనర్ ప్రావీణ్య, పొలిటికల్ లీడర్లు పాల్గొన్నారు.

బాధ్యతతో పనిచేయాలి..

స్టేషన్ ఘన్ పూర్:  ఓటు హక్కు కల్పించడానికి సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఆఫీసర్లను ఆదేశించారు.  బుధవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో పర్యటించారు. స్టేట్ ఎలక్షన్స్ జాయింట్ సీఈవో రవి కిరణ్, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి ఈఆర్ వోలు, ఏఈఆర్ వోలు, సూపర్ వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లలతో రివ్యూ చేశారు.  ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రత్యేక ఓటరు సవరణ జాబితా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు పకడ్బందీగా నిర్వహించి, ఫైనల్ ఓటర్​జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తిచేయాలన్నారు.

వర్ధన్నపేటలో..

వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహసీల్దార్ ఆఫీసును స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ పరిశీలించారు. ఓటరు నమోదు, సవరణను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ గోపి, ఆర్డీవో మహేందర్, తహసీల్దార్లు రవిచంద్ర రెడ్డి, సత్యనారాయణ తదితరులున్నారు.

హైవేపై వసూళ్ల పర్వం

  •     అటు టోల్ ఫీజ్.. ఇటు ఫారెస్ట్ ఫీజ్
  •     ఆందోళనలో వాహనదారులు

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: ములుగు నుంచి ఏటూరునాగారం వరకు ఎలాంటి రోడ్డు విస్తరణ పనులు చేయకుండానే టోల్ గేట్ ఏర్పాటు చేసి హైవే ఆఫీసర్లు డబ్బులు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు పర్యావరణం పేరుతో ఫారెస్ట్ ఆఫీసర్లు వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. దీంతో రెండు ఫీజులు కట్టలేక వాహనదారులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా– తాడ్వాయి మధ్య ఫారెస్ట్ ఆఫీసర్లు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. వచ్చీ పోయే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు చెక్ పోస్టు ఎప్పుడు పెట్టారు? ఎందుకు వసూళ్లు చేస్తున్నారో తెలియక వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. లైట్ మోటార్ వెహికల్స్ కు రూ.50, హెవీ మోటార్ వెహికల్స్ కు రూ.200 వసూలు చేస్తున్నారు.

‘రూల్స్ ప్రకారమే చేస్తున్నం’

గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే వసూళ్లు చేస్తున్నామని పస్రా వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ శిరీష తెలిపారు. పర్యావరణ నిర్వహణ రుసుమును ప్రభుత్వమే నిర్ణయించిందని, తమ సొంత నిర్ణయం కాదన్నారు. గతంలో పస్రాలో ఉండే చెక్  పోస్టును.. ఇప్పుడు అటవీ ప్రాంతంలోకి మార్చామన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామన్నారు.

సీఎం టూర్ ఏర్పాట్లు స్పీడప్ చేయండి

మహబూబాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు స్పీడప్ చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కేసీఆర్ ప్రారంభించబోయే మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. మెడికల్ కాలేజీలో ఇప్పటికే 100 మంది స్టూడెంట్లు చదువుతున్నారని తెలిపారు. కలెక్టరేట్ నిర్మాణానికి రూ.62.30కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చకుండా రాజకీయ పబ్బం గడుపుతోందన్నారు. సీమాంధ్ర నాయకులు మానుకోట రాళ్లు మర్చిపోయినా.. తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని షర్మిలను పరోక్షంగా విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,  ఈఈ తానేశ్వర్ ఉన్నారు.

‘సీతారామ’ పనులు పూర్తి చేయండి..

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని మున్నేరువాగుపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల కెనాల్ బ్రిడ్జి పనుల్ని మంత్రి సత్యవతి రాథోడ్  పరిశీలించారు. గోదావరి–కృష్ణా(పాలేరు) నదుల అనుసంధానంలో భాగంగా 14,15వ ప్యాకేజీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తి అయితే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.