భారతీయ విద్యార్థులూ తిరిగి వచ్చేయండి: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి

భారతీయ విద్యార్థులూ తిరిగి వచ్చేయండి: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి

ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత ఐరోపా దేశం నుంచి తిరిగి వచ్చేసిన భారతీయ విద్యార్థులకు.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా ఓ సందేశాన్ని పంపారు. భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. రష్యా పై ఉక్రెయిన్ గెలిచినప్పుడు తిరిగి రండి.. మీరు ఎల్లప్పుడూ మా సమాజంలో అంతర్భాగంగా ఉంటారని చెప్పారు. మీతో కలిసి తూర్పు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నగరంలో దీపావళిని జరుపుకోవాలి అనుకుంటున్నామని చెప్పారు. ఉక్రెయిన్ కోసం భారతీయ విద్యార్థులు ప్రార్థించండి అని డిమెట్రో కులేబా కోరారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో.. వేలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చేశారు. వారిలో ఎక్కువమంది మెడికల్ కోర్సులు చదువుతున్నారు. ఉక్రెయిన్‭లో సుమారు వైద్య విద్యను అభ్యసిస్తున్న 18వేల మంది విద్యార్థులు భారత్ కు తిరిగి వచ్చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బంకర్లలో ఆశ్రయం పొంది భయానక పరిస్థితులను ఎదుర్కొన్నారు. దురదృష్టవశాత్తు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి షెల్లింగ్‌లో మరణించాడు. వార్ జోన్ నుండి తప్పించుకుని భారత్ కు తిరిగి వచ్చేసిన విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు అంటూ పలు అంశాలపై డిమెట్రో కులేబా మాట్లాడారు.  

భారతీయ విద్యార్థులకు స్వాగతం చెబుతూనే.. మంత్రి డిమెట్రో కులేబా కేంద్రం పై అసహనం వ్యక్తం చేశారు. రష్యా సాగిస్తున్న దురాకమ్రణ యుద్ధంలో ఉక్రెయిన్లు ప్రతిరోజు చనిపోతుంటే.. మీకు అది వరమైందంటూ భారత్‌పై విరుచుకుపడ్డారు. మా కారణంగానే మీకు రష్యా చమురును చౌకగా కొనుగోలు చేసే అవకాశం వచ్చిందంటూ మండిపడ్డారు. ఇది నైతికంగా భారత్‌కి తగనిది అని నొక్కి చెప్పారు. మా బాధల కారణంగా మీరు ప్రయోజనం పొందినట్లయితే మాకు మరింత సాయం చేయడం మంచిది అని కులేబా చెప్పారు.