పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీ నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా...సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్

పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీ నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా...సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్
  • అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్నీ మానిటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మందుల నిల్వ, ఎక్విప్మెంట్​ అన్నీ లైవ్ అప్​డేట్స్​​ 
  • ఓపీలు, ఇన్-పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలన్నీ రికార్డ్ 
  • కలెక్టర్లు, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీలు, అధికారుల స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్ 
  • ఇప్పటికే బయటి రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ సిస్టమ్ సక్సెస్
  • మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ వైద్య రంగంలో భారీ సంస్కరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఒక ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) మొదలుకొని పట్టణాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి, రాజధాని నుంచి నిరంతరం పర్యవేక్షించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 

ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవలే ప్రకటన చేశారు. ఈ కమాండ్  కంట్రోల్ సెంటర్​ను ఎక్కడ ఏర్పాటు చేయాలి? టెక్నికల్ సపోర్టు ఎక్కడి నుంచి తీసుకోవాలి? తదితర వివరాలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ  వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే  బయటి రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ విధానాన్ని మన దగ్గర కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా.. 

ప్రస్తుతం రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్), వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లాంటి విభాగాలు అటెండెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి విడివిడిగా పర్యవేక్షణ సాగిస్తున్నాయి. అయితే, వీటి మధ్య సమన్వయం పెంచేందుకు ప్రతిపాదిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక కీలక వారధిగా మారనుంది. 

కేవలం హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం కాకుండా డ్రగ్ కంట్రోలింగ్, ఫుడ్ సేఫ్టీ, ఐపీఎం, ఆయుర్వేదం, మెడికల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి అన్ని కీలక విభాగాలను ఒకే సర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానిస్తారు. 

మందుల కొరతకు చెక్

హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మందుల కొరత లేకుండా ఇన్వెంటరీ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ సెంటర్ ద్వారా బలోపేతం చేయనున్నారు. ఏదైనా ఆస్పత్రిలో మందుల నిల్వలు అయిపోవడానికి ముందే ఈ సిస్టమ్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే, హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే, స్కాన్ మెషీన్లులాంటి వైద్య పరికరాలు ఎన్ని పని చేస్తున్నాయి? ఏవి రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి? అనే అంశాలను డైలీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఏదైనా మెషినరీ పనిచేయకపోతే వెంటనే సంబంధిత విభాగానికి అలర్ట్ వెళ్లడం ద్వారా నిర్ణీత సమయంలోనే వాటిని రిపేర్ చేయించే వీలుంటుంది. 

ఇక 108, 104 అంబులెన్స్ సేవలను కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ, అత్యవసర సమయంలో అవి ఎంత వేగంగా రోగి వద్దకు చేరుతున్నాయనేది నిరంతరం మానిటర్ చేస్తారు. అంబులెన్స్ ఎక్కడ ఉంది?  కాల్ వచ్చిన ఎంత సేపటికి రోగి దగ్గరకు చేరింది? అనేది మ్యాపింగ్ ద్వారా చూస్తారు. ప్రమాదం జరిగినప్పుడు రోగిని సమీపంలోని ఏ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాలి? అక్కడ అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా? అనేది కమాండ్ సెంటర్ గైడ్ చేస్తుంది.

దీనివల్ల ఏ విభాగంలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులకు క్షణాల్లో సమాచారం అందుతుంది. హాస్పిటల్స్‌‌‌‌లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా డాక్టర్లు, సిబ్బంది విధుల్లో ఎలా ఉంటున్నారు? రోగులకు అందుతున్న సేవలు ఏమిటి? అనేది లైవ్ మానిటరింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. హాస్పిటల్ కారిడార్లు, ల్యాబొరేటరీలు, ఫార్మసీ కౌంటర్ల వద్ద నిరంతర నిఘా ఉంటుంది. ఆయుర్వేదం, హోమియోపతి హాస్పిటల్స్  పనితీరు, అక్కడ అందుబాటులో ఉన్న డాక్టర్లు, మందుల పంపిణీని కూడా ఈ సెంటర్ కిందికే తేనున్నారు.

అధికారులస్థాయిని బట్టి యాక్సెస్ 

ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నిర్వహణలో పకడ్బందీ ప్రొటోకాల్స్ ఉండనున్నాయి. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారుల హోదాను బట్టి మానిటరింగ్ యాక్సెస్ ఇస్తారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని హాస్పిటల్స్, డీఎంహెచ్‌‌‌‌వోలు తమ పరిధిలోని పీహెచ్‌‌‌‌సీలను పర్యవేక్షించవచ్చు. హెచ్‌‌‌‌వోడీలు తమ డిపార్ట్‌‌‌‌మెంట్లకు సంబంధించిన వివరాలను చూడొచ్చు. ఇక రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పరిధిలో ఉన్న అన్ని విభాగాల సమాచారం మంత్రి, సెక్రటరీల పర్యవేక్షణలో ఉంటుంది. 

వైద్యులు, సిబ్బంది హాజరును ఆధార్ బేస్డ్ ఫేషియల్ అటెండెన్స్, జియో-ఫెన్సింగ్ ద్వారా కచ్చితంగా పర్యవేక్షిస్తారు. ఒక డాక్టర్ నెలకు ఎన్ని సర్జరీలు చేస్తున్నారు? ఎన్ని కేసులు చూస్తున్నారు? అనే డేటా ఆధారంగా వారి పనితీరును విశ్లేషిస్తారు. డేటా ఆధారంగా వారికి ర్యాంకింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

డిజిటల్ నిఘాలో ప్రజారోగ్యం

ఈ వ్యవస్థ కేవలం హాస్పిటల్ నిర్వహణకే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడనుంది. ఏదైనా ప్రాంతంలో అకస్మాత్తుగా డెంగ్యూ, మలేరియాలాంటి అంటువ్యాధుల కేసులు పెరిగితే, సిస్టమ్ వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంది. తద్వారా అక్కడికి వెంటనే వైద్య బృందాలను పంపి మహమ్మారిని అరికట్టవచ్చు. ఆహార కల్తీని అరికట్టేందుకు ఫుడ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ల తనిఖీలను, ల్యాబ్ రిపోర్టులను కూడా దీని ద్వారా ట్రాక్ చేస్తారు. 

హోటళ్లు, ఫుడ్ యూనిట్ల లైసెన్సుల స్థితిగతులను పర్యవేక్షిస్తారు. డ్రగ్ కంట్రోలింగ్‌‌‌‌కు సంబంధించి ప్రైవేట్ మెడికల్ షాపుల తనిఖీలు, లైసెన్సుల జారీ, నకిలీ మందుల అదుపుపై ఫీల్డ్ అధికారుల కదలికలను ట్రాక్ చేస్తారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మినిట్‌‌‌‌ టు మినిట్ ప్రతి అంశం  ప్రభుత్వానికి డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల జవాబుదారీతనం పెరిగి, సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి పర్యవేక్షణలో ప్రభుత్వ వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

ఓపీ నుంచి సర్జరీ దాకా లైవ్ అప్‌‌‌‌డేట్స్..

ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రతి హాస్పిటల్ పనితీరు గణాంకాలతో సహా  విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఏ హాస్పిటల్‌‌‌‌లో రోజుకు ఎన్ని ఓపీలు నమోదయ్యాయి? ఎంతమంది ఇన్‌‌‌‌-పేషెంట్లు చేరారు? ఆ రోజు జరిగిన సర్జరీలు ఎన్ని? అనే వివరాలు ఎప్పటికప్పుడు కమాండ్ సెంటర్ స్క్రీన్లపై ప్రత్యక్షమవుతాయి. 

ఐసీయూలు, జనరల్ వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలు రియల్ టైమ్‌‌‌‌లో అప్‌‌‌‌డేట్ అవుతుంటాయి. దీనివల్ల ఒక హాస్పిటల్  నుంచి మరో హాస్పిటల్‌‌‌‌కు రోగులను రిఫర్ చేసే సమయంలో బెడ్ల కొరతలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే జాగ్రత్త పడవచ్చు.  క్షేత్రస్థాయిలో రోగి రిజిస్ట్రేషన్ చేసుకున్న నిమిషం నుంచే వారి చికిత్స ప్రక్రియ మొత్తం డిజిటల్ నిఘాలో ఉంటుంది.