హైదరాబాద్, వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్ పై కాల్పులు జరిగి 29 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 26న ‘ప్రశ్నించే గొంతులు..- సాధించిన విజయాలు’ పేరుతో సభ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు సబ్బండ కులాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ జీవీ సూర్య కిరణ్ తో కలిసి సభ వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 1997 ఏప్రిల్ 6న పాలకులకు ధిక్కారస్వరంగా, ప్రశ్నించే గొంతుకగా ఉన్న ప్రజా యుద్ధనౌక గద్దర్ పై నాటి ఆంధ్రా పాలకుల పాలనలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారని ఆయన గుర్తు చేశారు. కాల్పులు జరిపి ఈ నెల 26 నాటికి 29 సంవత్సరాలు పూర్తవుతాయని.. ఇప్పటికీ దోషులను అరెస్టు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన రోపించారు. ఈ సమావేశంలో గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సరిత, బీసీ నేతలు గజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
