మొబైల్‌‌ గేమ్స్‌‌కూ కామెంటేటర్‌‌‌‌

మొబైల్‌‌ గేమ్స్‌‌కూ కామెంటేటర్‌‌‌‌

క్రికెట్‌‌ లాంటి ఔట్‌‌డోర్ గేమ్స్‌‌కి కామెంట్రీ చెప్పడం, సినిమాల్లో క్యారెక్టర్స్‌‌కి డబ్బింగ్‌‌ చెప్పడం కామన్‌‌. కానీ.. ఎక్కడైనా మొబైల్‌‌లో ఆడే వీడియో గేమ్స్‌‌కి కామెంట్రీ, డబ్బింగ్ చెప్పడం చూశారా? మిథిలేశ్‌‌ పటాన్‌‌కర్‌‌‌‌ పబ్జీలాంటి గేమ్స్‌‌కి కామెడీగా బాలీవుడ్‌‌ స్టార్స్ వాయిస్​లతో కామెంట్రీ చెప్తుంటాడు.అంతేకాదు ఇప్పటివరకు ఎన్నో గేమ్స్‌‌కి డబ్బింగ్‌‌ చెప్పి, ఆ వీడియోలను యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేశాడు కూడా. వాటిని కొన్ని మిలియన్ల మంది చూస్తున్నారు. మిథిలేశ్‌‌ పటాన్‌‌కర్‌‌‌‌ మహారాష్ట్రలోని ముంబైలో1998 లో పుట్టాడు. చిన్నప్పటినుంచి మిమిక్రీ అంటే ఇష్టం. చదువుకునే రోజుల్లో ఫ్యామిలీ ఫంక్షన్స్‌‌లో మిమిక్రీ చేసేవాడు. అది చూసి అందరూ మెచ్చుకునేవాళ్లు. పేరెంట్స్‌‌ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్లు.  మిథిలేష్‌‌కు ఫ్రెండ్స్​ చాలా తక్కువత. అందుకే ఫ్యామిలీతోనే ఎక్కువ టైం గడిపేవాడు. లేదంటే చదువుకునేవాడు. అప్పుడప్పుడు వీడియోగేమ్స్‌‌ ఆడేవాడు. బాల్​మోహన్ విద్యామందిర్‌‌‌‌లో స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌, విద్యాలంకార్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌‌ పూర్తి చేశాడు. 

కాలేజీలో...

మిథిలేష్ చిన్నప్పుడు ఇంట్రోవర్ట్‌‌. అందువల్ల ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అంత ఈజీగా కలిసిపోయేవాడు కాదు. షారుక్​ ఖాన్‌‌కి బిగ్‌‌ ఫ్యాన్‌‌. అందుకే షారుక్​ని ఇమిటేట్‌‌ చేయడానికి అతని వాయిస్‌‌ ప్రాక్టీస్‌‌ చేశాడు.16 రోజులు ప్రాక్టీస్ చేశాక అచ్చం షారుక్​లాగే మాట్లాడగలిగాడు. దాన్ని తన ఫోన్‌‌లో రికార్డ్ చేసి, ఫ్యామిలీ మెంబర్స్‌‌కి వినిపించాడు. అందరూ మెచ్చుకోవడంతో అప్పటినుంచి చాలామంది సినిమా స్టార్ల వాయిస్‌‌లను ప్రాక్టీస్‌‌ చేశాడు. కానీ.. స్కూల్‌‌లో తన టాలెంట్‌‌ని ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇంజనీరింగ్‌‌లో చేరాక అతనిలో ధైర్యం పెరిగింది. దాంతో ఒకసారి కాలేజీ ఈవెంట్‌‌లో మిమిక్రీ చేశాడు. అప్పటినుంచి కాలేజీలో మిథిలేష్ ఒక సెలబ్రిటీ అయిపోయాడు. కాలేజీలో ఏ ఈవెంట్ జరిగినా మిథిలేష్‌‌ మిమిక్రీ పర్ఫార్మెన్స్‌‌ ఉండేది. బోలెడన్ని పోటీల్లో పాల్గొని అవార్డులు కూడా దక్కించుకున్నాడు. 

మిత్‌‌పట్‌‌

తనలోని టాలెంట్‌‌ని అందరికీ తెలిసేలా చేయాలి అనుకున్నాడు మిథిలేష్​. ఆ ఆలోచనతోనే యూట్యూబ్‌‌లోకి అడుగు పెట్టాడు. 2018లో ‘‘మిత్‌‌పట్‌‌’’  అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. అందులో మొదట ఒక మిమిక్రీ వీడియో అప్‌‌లోడ్‌‌ చేశాడు. కానీ.. దానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. దాంతో బాలీవుడ్‌‌ యాక్టర్స్‌‌ వాయిస్‌‌తో పబ్జీ గేమ్‌‌కి కామెంట్రీ చెప్పి ఒక వీడియో రికార్డ్‌‌ చేశాడు. ఆ యాక్టర్స్‌‌ గేమ్‌‌ ఆడితే ఎలా ఉంటుందో ఆ వీడియోలో చూపించాడు. ఆ తర్వాత కూడా కొన్ని వీడియోలు చేశాడు. కానీ.. అనుకున్నంత రీచ్‌‌ రాలేదు. 2019 జనవరిలో డోరేమాన్ కార్టూన్‌‌పై ఒక ఫన్నీ కామిక్ వీడియో అప్‌‌లోడ్ చేశాడు. అది విపరీతంగా వైరల్ అయింది. రెండు మూడు రోజుల్లోనే అతని ఛానెల్‌‌ని వెయ్యిమంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. మరో ఐదు రోజుల్లో  ఐదు వేల సబ్‌‌స్క్రయిబర్స్‌‌ మార్క్‌‌ని దాటింది. రెండు నెలల్లోనే లక్ష మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. అప్పటినుంచి డబ్బింగ్, గేమింగ్‌‌ని కలిపి వీడియోలు చేస్తున్నాడు. అంటే గేమ్స్‌‌లో ఉండే క్యారెక్టర్స్‌‌కి డబ్బింగ్‌‌ చెప్తూ వీడియోలు చేస్తున్నాడు. ఈ కాన్సెప్ట్‌‌ని ‘క్వెబెల్‌‌కాప్‌‌’ అనే డచ్ యూట్యూబర్‌‌‌‌ నుంచి తీసుకున్నాడు. మిథిలేష్​ కామెడీగా కామెంట్రీ చెప్పే విధానం ఎంతోమందిని ఎట్రాక్ట్ చేసింది. 

నెట్ వర్త్

మిత్‌‌పట్‌‌ ఛానెల్‌‌కు ప్రస్తుతం 1.24 కోట్ల మంది సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటికయితే నెలకు కనీసం 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. స్పాన్సర్‌‌షిప్స్‌‌ నుంచి కూడా కొంత డబ్బు వస్తోంది.  బ్రాండ్‌‌ల కోసం మిమిక్రీ చేసి కూడా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మొత్తం ఆస్తి 3 కోట్ల 50 లక్షల రూపాయలకు పైనే ఉంది.