- వేలల్లో అద్దె.. పని చేయని ఏసీలు, టీవీలు..
- క్యాంటీన్లు క్లోజ్ చేయడంతో తిండికి తిప్పలు
- లక్నవరంలో అస్తవ్యస్తంగా అద్దాల రూములు
వరంగల్, ములుగు/వెలుగు: రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం, వెయ్యి స్తంభాల గుడి, ఖిలా వరంగల్ వంటి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలతో ఓరుగల్లు ప్రాంతం రాష్ట్రంలోనే ప్రముఖ టూరిజం హబ్‌గా నిలుస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ప్రధాన విడిదిగా ఉండాల్సిన ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలోని హరిత కాకతీయ హోటళ్లు మాత్రం నాసిరకం సేవలతో విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పర్యాటకులకు సరైన వసతులు కల్పించకపోవడంతో ఓరుగల్లు పర్యాటక రంగ ప్రతిష్ఠకు దెబ్బ తగులుతోంది.
తిండితిప్పలకు ఇబ్బందులు..
రామప్ప, లక్నవరం, పాకాల, ములుగు గట్టమ్మ, బొగత, తాడ్వాయి, మల్లూరు, కాళేశ్వరం ప్రాంతాల్లో టూరిజం శాఖ హరిత హోటళ్లు నిర్వహిస్తోంది. గదులకు నాన్ ఏసీ విభాగంలో రూ.2,500 వరకు, ఏసీ గదులకు రూ.5 వేలకుపైగా వసూలు చేస్తున్నప్పటికీ, పర్యాటకులకు కనీస ఆహార సదుపాయాలు కూడా అందుబాటులో లేవని టూరిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కేంద్రాల్లో క్యాంటీన్లు మూసివేయడంతో చాయ్, టిఫిన్, భోజనం కోసం 30 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా చాలా చోట్ల పనిచేయడం లేదని తెలుస్తోంది.
లక్నవరం గ్లాస్ రూములు క్లోజ్..
సరస్సు మధ్యలో ఉన్న గ్లాస్ రూములు, హట్స్ లక్నవరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినా, ప్రస్తుతం అవి పాడై వినియోగానికి దూరమయ్యాయి. గ్లాస్ గోడలు ధ్వంసమైనా మరమ్మతులు చేపట్టకపోవడంతో పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. గదుల్లో ఏసీలు, టీవీలు పనిచేయకపోవడం, ఇతర సేవలు సరిగా లేకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. సరస్సులో నడిపే బోట్లు కూడా పాతవే కావడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాకాల హోటల్ అటవీశాఖకు..
పాకాల అభయారణ్యం ప్రాంతంలోని హరిత హోటల్ నిర్వహణను ఇటీవల అటవీశాఖకు బదిలీ చేశారు. టూరిజం, అటవీశాఖల మధ్య సమన్వయం లోపంతో హోటల్, క్యాంటీన్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో వచ్చే సందర్శకులకు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రైవేటుకు లీజు.. ప్రభుత్వ ఖర్చులు..?
కొన్ని హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చి, మరమ్మతుల కోసం ప్రభుత్వ నిధులను భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మేడారం, కాళేశ్వరం, తాడ్వాయి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ సొమ్ముతో మరమ్మతులు చేపట్టి, అనంతరం ప్రైవేటు నిర్వహణకు అప్పగిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్‌లో మాత్రమే సేవలు అందించి, మిగతా సమయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటక రంగంలో ఓరుగల్లుకు ఉన్న ప్రత్యేక గుర్తింపును నిలబెట్టాలంటే హరిత హోటళ్లలో మౌలిక సదుపాయాలు, ఆహార సేవలు, భద్రతా ఏర్పాట్లను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పర్యాటకులు కోరుతున్నారు.
